లూసిఫర్ తెలుగు రీమేక్‌లో రెహమాన్..!
By తోట వంశీ కుమార్ Published on 14 July 2020 6:59 AM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాను పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. ఈ సినిమా పూర్తీ అవ్వగానే మలయాళం సినిమా 'లూసిఫర్' రీమేక్ ను మొదలుపెట్టబోతున్నారు. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్ కావడంతో రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. 'సాహో' లాంటి భారీ బడ్జెట్ ను తెరకెక్కించిన సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.. ఈ ఏడాది చివరికల్లా సినిమా పట్టాలు ఎక్కనుంది.
ఈ సినిమాలో చేయబోయే నటీనటుల గురించి చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దక్షిణాది నటుడు రెహమాన్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించనున్నాడు. ఒరిజినల్ లో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను తెలుగు రీమేక్ లో రెహమాన్ చేయనున్నాడు. మలయాళం చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోగా ఎదిగిన రెహమాన్ తెలుగులో ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో చేశాడు. ఈసారి మెగాస్టార్ సినిమాలో అవకాశం దక్కిందని మలయాళం మీడియా చెబుతోంది. దీనికి సంబంధించి చిత్ర బృందం నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఈ సినిమాలో మంజు వారియర్ పాత్ర కోసం వెటరన్ యాక్ట్రెస్ సుహాసినిని సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియాను కూడా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. పలువురు నటీనటులు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ సారథ్యంలో రామ్ చరణ్ నిర్మించనున్నారు.
కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు చేయడంతో చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. సోషియో-పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. రెజీనా కసాండ్రా ఓ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో ఆడిపాడింది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.