క్యూ నెట్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..!
దేశావ్యాప్తంగా కోట్ల రూపాయలు మోసం చేస్తున్న క్యూ నెట్ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
By - Medi Samrat |
దేశావ్యాప్తంగా కోట్ల రూపాయలు మోసం చేస్తున్న క్యూ నెట్ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ పై తెలంగాణ లో 68, హైదరాబాద్ లో 22 కేసులు ఉన్నాయని.. ఇటీవల మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఎస్బీ జాయింట్ సీపీ ఆధ్వర్యంలో లో దీనిపై ప్రత్యేక టీమ్ ఫామ్ చేసి.. మూడు రాష్ట్రాలలో 27 ప్రాంతాల్లో సోదాలు చేసి 32 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. అక్టోబర్ లో తెలంగాణ లో ఒక ఆత్మహత్య నమోదైందని.. క్యూ నెట్ లో బాధితుడు అయి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.
గతంలో వెల్నెస్ ప్రాడక్ట్స్ అమ్మేవారు కానీ ఇప్పుడు బిస్కెట్లు, తేనే ఇతర వస్తువులు అమ్ముతున్నారు.. గతంలో క్యూ నెట్ పై కేసులు నమోదై మీడియాలో వచ్చాయని ఇప్పుడు సంస్థ పేరు చెప్పట్లేదన్నారు. సంస్థ పేరు చెప్పకుండా బాండ్ రాయించుకుని మరి పెట్టుబడి పెట్టిస్తున్నారు.. ఐటి ఉద్యోగులను సెకండ్ ఇంకమ్ పేరుతో ఎక్కువగా ఆకర్షిస్తున్నారు.. మంచి మంచి స్టార్ హోటళ్ళల్లో మీటింగ్స్ పెడుతున్నారు.. పెట్టుబడి పెట్టి ప్రొడక్ట్స్ అమ్మాలని చెబుతున్నారు.. డబ్బులు లేని వారికి ఫింటెక్ కంపెనీ నుంచి రుణాలు ఇప్పించి క్యూ నెట్ లో పెట్టుబడి పెట్టిస్తున్నారు.. కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. మోసపోయిన ఉద్యోగుల్లో ప్రముఖ ఐటీ కంపెనీల వాళ్ళు కూడా ఉన్నారని వివరించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండటంతో ఈడీకి సమాచారం అందజేస్తామని సజ్జనార్ తెలిపారు. అమాయక ప్రజలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, సులభంగా డబ్బు సంపాదిస్తామని వచ్చే ఆఫర్లకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సీపీ హెచ్చరించారు.