స్వచ్ఛమైన ఆక్సిజన్ ₹299 లకే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 10:20 AM ISTభూమ్మీద పుట్టిన ప్రతి మనిషికి గాలి, నీరు సహజంగా దొరికే వనరులు. కానీ మన ఖర్మ ఏంటంటే స్వచ్ఛమైన నీటిని కొనుక్కొని తాగడం మొదలుపెట్టి దశాబ్దం దాటింది. ఇప్పుడు గాలి కూడా ఆ లిస్టులో చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. ఆదిత్య369 సినిమాలో లాగా ఢిల్లీ వాసులు బయటికి వెళ్ళాలి అంటే వొల్లు, కళ్ళు అన్నీ కవర్ చేసుకునే తిరగాలి.. జీవనదులు పారే ఈ దేశంలో మంచినీళ్లు సీసాలో పెట్టి లీటర్ల లెక్కన అమ్ముతూ వచ్చిన మనం ఇప్పుడు మరొక మెట్టు పైకి ఎక్కాం.. అదే గాలి అమ్ముకోవడం.
దేశ రాజధాని ఢిల్లీలో “ఆక్సి ప్యూర్” అనే పేరుతో ఆక్సీజన్ అమ్మే ఒక దుకాణం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఢిల్లీ పరిధిలోని సాకేత్ అనే ప్రాంతంలోని ఈ షాప్ లో 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన గాలిని 299 రూపాయలు పెట్టి పీల్చుకోవచ్చట.
ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్ లో ఏడు రకాల ఫ్లేవర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నిమ్మగడ్డి, దాల్చిన చెక్క, పుదీనా, ఆరెంజ్, నీలగిరి, లావెండర్, వెనీలా, చెర్రీ, బాదం, పెప్పరమెంట్ తదితర సువాసనలతో గాలిని ఊపిరితిత్తుల్లో నింపుకోవచ్చు. గాలిలోని నైట్రోజన్ తొలగించడం ద్వారా ఆక్సి ప్యూర్ బార్ లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవచ్చట. పీడనాన్ని అదుపు చేస్తూ గాలిని అందిస్తామని, ఒకసారి పీల్చుకుంటే శరీరంలో ఉత్తేజం కలుగుతుందని షాపు నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యకరమైన గాలి కావడంతో చక్కగా నిద్ర పడుతుందని, జీర్ణశక్తి కూడా బాగుంటుందని అంటున్నారు. చదువుతుంటే బాధగా, భవిష్యత్ గురించి భయంగా ఉంది కదూ.. మరి అభివృద్ధి కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడితే కలిగే దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇక ఎప్పటికీ తెరవలేమేమో.