గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుండి తీసేశారుగా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sept 2020 2:40 PM ISTపబ్జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. బ్యాన్ చేసిన యాప్స్ లో పబ్ జీ కూడా ఉన్న సంగతి తెలిసిందే..! యువతలో హింసాత్మక ప్రవృత్తిని పెంచిపోషిస్తున్న పబ్ జీని దేశంలో బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి.
చైనా లింక్డ్ యాప్స్ ను బ్యాన్ చేసి రెండు రోజులు అవ్వగా.. పబ్ జీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోనూ, యాపిల్ యాప్ స్టోర్ లోనూ కనిపించడం లేదు. పబ్ జీ మొబైల్ అన్నది ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉండదని స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఆడుతూ ఉన్నారు. అతి త్వరలోనే పబ్ జీ ఆడకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లోనూ, యాపిల్ స్టోర్ లోనూ పబ్ జీ అంటూ సెర్చ్ చేయగా ఒరిజినల్ గేమ్ ను చూపించలేదు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో పబ్ జీ ఆడకుండా మరిన్ని నిషేధాలు విధించనున్నారు. గూగుల్ లో సెర్చ్ చేస్తే ప్లే స్టోర్ లో ఉన్నట్లు కనిపిస్తోంది కానీ.. డౌన్ లోడ్ చేయడానికి వీలుపడడం లేదు. త్వరలోనే ప్లే స్టోర్ లిస్టింగ్ లో కూడా పబ్ జీ లేకుండా పోనుంది. పబ్ జీ మొబైల్ తో పాటూ, పబ్ జీ లైట్ వెర్షన్ కూడా యాప్ స్టోర్స్ లో కనిపించకుండా పోయాయి.
పబ్ జీ డెస్క్ టాప్ వెర్షన్ ఆడుకోవచ్చని చెబుతున్నారు. పబ్ జీ దక్షిణ కొరియాకు చెందినది. మొబైల్ యాప్ హక్కులను చైనాకు చెందిన టెన్ సెన్ట్ సంస్థకు విక్రయించింది. కానీ డెస్క్‌టాప్ వెర్షన్ హక్కులను మాత్రం అప్పగించలేదు. దక్షిణ కొరియాకే చెందింది కాబట్టి భారత్‌లో డెస్క్ టాప్ వెర్షన్ పై నిషేధం విధించకపోవచ్చని భావిస్తూ ఉన్నారు. ఇన్నాళ్లూ పబ్ జీ ఆడుకోడానికే మొబైల్స్ కొనిచ్చుకున్న పిల్లలు.. ఇకపై ల్యాప్ టాప్ లు కొనివ్వమని పేరెంట్స్ మీద పడుతారో.. లేక పబ్ జీ తరహాలో ఉండే మరో మొబైల్ గేమ్ కు బానిసలు అవుతారో వేచి చూడాలి.