ఎంతో కాలంగా త‌మ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల‌కు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ శుభ‌వార్త చెప్పనున్నాడు. అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత‌ వెండితెరపై క‌న‌ప‌డ‌ని ప‌వ‌న్‌.. హిందీలో సూప‌ర్ హిట్టైన `పింక్` సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా విశేషాల‌కై ప‌వ‌న్ అభిమానులు ఎప్పుడు.. ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుందోన‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

ఇక‌.. ఈ సినిమాను కుటుంబ క‌థా చిత్రాల నిర్మాత‌ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు ఆస్థాన‌ దర్శకుడు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడ‌వడం విశేషం. కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ప్రారంభ‌యిన ఈ సినిమా.. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు మ‌నుగ‌డ‌లో ఉన్న వ‌ర్కింగ్ టైటిల్ `వకీల్ సాబ్`ను టైటిల్ ఫిక్స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర‌బృందం ట్విట‌ర్ ద్వారా ప్రకటించింది. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ ఏంటో తెలుసుకోవడానికి అటు​ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. బోని కపూర్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా విడుదల చేయనున్నట్టు స‌మాచారం.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.