ఆస్తి ప‌న్నుపై 90శాతం త‌గ్గింపు.. తెలంగాణ స‌ర్కార్ బంప‌ర్ ఆఫ‌ర్‌

By సుభాష్  Published on  29 July 2020 3:23 AM GMT
ఆస్తి ప‌న్నుపై 90శాతం త‌గ్గింపు.. తెలంగాణ స‌ర్కార్ బంప‌ర్ ఆఫ‌ర్‌

భారీగా పేరుకుపోయిన ఆస్తి ప‌న్ను బ‌కాయిల‌ను వ‌సూలు చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు బ‌కాయిదారుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ, ప‌ట్ట‌ణాల్లో ఆస్తి ప‌న్ను బ‌కాయిల కోసం ఓటీఎస్ (వ‌న్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ ) ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు తెలంగాణ మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ప్రాప‌ర్టీ ట్యాక్స్ పై వ‌డ్డీ భారాన్ని త‌గ్గించింది ప్ర‌భుత్వం. 2019-20 ఆస్తి ప‌న్ను మొత్తాన్ని ప‌ది శాతం వడ్డీతో క‌డితే.. 90శాతం వ‌డ్డీ మాఫీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఆగ‌స్టు 1 నుంచి సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. అయితే గ్రేట‌ర్ ప‌రిధిలోనే5.64 ల‌క్ష‌ల మంది ప్రాప‌ర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారు.

కాగా, ఒకేసారి బకాయి చెల్లిస్తే దానిపై వడ్డీ చెల్లింపులలో 90శాతం తగ్గించనున్నట్లు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఆస్తి పన్ను బకాయిలు అసలు రూ.1,477.86 కోట్లు, వడ్డీ రూ.1,017.76 కోట్లు రావాల్సి ఉంది. ఈ మేరకు వారకి అధికారులు నోటీసులు జారీ చేశారు. కొంత తగ్గిస్తే బకాయిలు చెల్లిస్తామని పలువురు ప్రభుత్వానికి నివేదించగా, ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం వడ్డీ 90శాతం తగ్గింపు ప్రకటించింది. దీని ద్వారా ఒక్క జీహెచ్‌ఎంసీలోనే దాదాపు రూ.900 కోట్ల మేరకు ప్రయోజనం చేకూరనుంది.

Next Story