పరేషాన్‌గా మారిన ఫ్లైట్ జర్నీ.. కారణం ఏమిటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 May 2020 8:50 AM GMT
పరేషాన్‌గా మారిన ఫ్లైట్ జర్నీ.. కారణం ఏమిటి?

లాక్ డౌన్ నేపథ్యంలో గడిచిన కొద్దికాలంగా దేశీయంగా విమాన సర్వీసులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ రోజు నుంచి విమాన సర్వీసులు షురూ అయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల మీద చిక్కుకుపోయిన వారు.. అత్యవసరంగా గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో ఎయిర్ పోర్టులు కళకళలాడుతున్నాయి. గతంలో మాదిరి పెద్ద ఎత్తున విమాన సర్వీసులు అందుబాటులోకి రాకున్నా.. ఉన్న సర్వీసులతో ప్రయాణాలకు సిద్ధమయ్యారు.

అయితే.. విమాన సర్వీసులు కొన్ని అనుకోని రీతిలో క్యాన్సిల్ కావటం దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విమాన సర్వీసుల్ని క్యాన్సిల్ చేయటం.. రీషెడ్యూల్ చేయటం లాంటి కారణాలతో ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ ప్రయాణికుల ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి. విమానాలు ఎప్పుడు నడుస్తాయో? మరెప్పుడూ రీషెడ్యూల్ అవుతాయన్న విషయం మీద స్పష్టత లేకపోవటమే కాదు.. కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నారు.

కొన్ని విమానాలు చివరి నిమిషాల్లో రద్దు కావటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమకు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే.. ఎయిర్ పోర్టుకు వచ్చి ఉండేవాళ్లం కదా? అన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు. దేశంలోని మరికొన్ని విమానాశ్రయాల్లో అయితే ప్రయాణికులు నిరసనలు చేపడుతున్నారు. మొత్తానికి దేశంలోని చాలా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Next Story
Share it