సామాజిక మాధ్యమానికి దూరగా ఉంటా అని ప్రకటించి సెన్షేషన్ సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రకటనపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే మహిళలకు తన సోషల్‌మీడియా ఖాతాలను అప్పగిస్తానని పేర్కొన్నారు.

వచ్చే ఆదివారం.. మహిళా దినోత్సవం. ఎదుటివారికి స్ఫూర్తిగా నిలిచిన మహిళల కోసం తన సోషల్ మీడియా అకౌంట్లను వారికి అప్పగిస్తున్నట్టు మోడీ ప్రకటించారు. అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుందన్నారు.

అలాంటి స్ఫూర్తిదాయక మహిళలు మీకు తెలిసినా, ఒకవేళ మీరే అలాంటి మహిళే అయితే ఆ స్ఫూర్తినిచ్చే కథనాలను షేర్‌ చేయండి అంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. #SheInspireUs‌తో ట్యాగ్ చేయమని సూచించారు. పంపించిన వారిలో ఒకరిని ఎంపిక చేసి మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి సామాజిక మాధ్యమాల అకౌంట్లను అప్పగిస్తానని పేర్కొన్నారు.

మార్చి8 నుంచి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని లక్షలాది మంది మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇక ప్రతిపక్ష నేతలు సైతం మోడీ ప్రకటనపై తమదైన శైలిలో విమర‍్శలు గుప్పించారు. పలు అనుమానాలు లేవనెత్తారు.

అయితే వీటన్నింటికీ నరేంద్ర మోదీ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. తానెందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను వదిలేస్తానన్నది స్పష్టం చేస్తూ మోడీ ఓ ట్వీట్‌ చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన ట్విట్టర్ అకౌంట్ ను మహిళలకే అంకితమిస్తున్నట్లు మోడీ చెప్పారు.

ట్విటర్, ఫేస్‌ బుక్‌,ఇన్ స్టాగ్రామ్ లో మోడీ చాలా యాక్టీవ్ ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్‌లో మోడీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోడీనే. ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్‌ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్‌ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోడీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు ఒబామా ఉన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.