నేటి నుంచి హైదరాబాద్‌ లో పీబీఎల్-5

By Newsmeter.Network
Published on : 29 Jan 2020 11:32 AM IST

నేటి నుంచి హైదరాబాద్‌ లో పీబీఎల్-5

పీబీఎల్‌ అభిమానులకు శుభవార్త ఇది. ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) పీబీఎల్-5 చివరి దశ పోటీలకు భాగ్యనగరం అతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలీ స్టేడియంలో నేటి(బుధవారం) నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడాకారులు తమ విన్యాసాలతో అభిమానులను అలరించనున్నారు. ఈ పోటీల్లో 13 పాయింట్లతో చెన్నై మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ హంటర్స్ 4 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. బుధవారం జరిగే పోరులో నార్త్ ఈస్టర్న్‌ వారియర్స్‌ తో హైదరాబాద్‌ హంటర్స్ తలపడుతుంది. సొంతగడ్డపై స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు మాయాజాలం చేస్తుందని హంటర్స్ భావిస్తోంది.

టైటిల్ కొడతాం..

మ్యాచ్‌ లో ఏ ప్లేయర్‌ కూడా ఓడిపోవాలని కోరుకోరు. ఒక్కొసారి స్వల్ప తేడాతో ఓడిపోతామని ఇటీవల ఎదురైన వరుస పరాజయాలపై సింధు వివరణ ఇచ్చింది. ‘అలాంటి ఓటములు, కఠిన మ్యాచ్‌లు నన్ను మరింత రాటుదేలుస్తాయి. నేను కోర్టులోకి ఎప్పుడు అడుగుపెట్టినా విజయం కోసం వందశాతం శ్రమిస్తా. అయినా సరే అప్పుడప్పుడు ఆశించిన ఫలితం రాకపోవచ్చు’ అని సమాధానం ఇచ్చింది.

ఇక ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ గురించి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా పీబీఎల్‌ తన ఒలింపిక్స్‌ సన్నద్ధతకు కూడా బాగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించిన విషయాన్ని పక్కనపెట్టి మిగిలిన మ్యాచ్‌ల్లో ఎలా సత్తా చాటాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. అభిమానుల మద్దతు, హోం గ్రౌండ్‌ అడ్వాంటేజ్‌తో ఇక నుంచి అదరగొడతామని చెప్పింది. నార్త్‌ ఈస్ట్‌ వారియర్స్‌తో బుధవారం జరగనున్న పోరులో సమష్ఠిగా రాణించి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. 2018 లీగ్‌ ఆరంభంలోనూ ఇలానే వెనుకబడ్డాం. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని టైటిల్‌ను దక్కించుకున్నాం. ఈ సీజన్‌లో కూడా అలానే పుంజుకుంటామని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది.

Next Story