అకాల వర్ష బీభత్సం.. ఏపీలో 14 మంది మృతి..
By Newsmeter.Network Published on 10 April 2020 3:32 AM GMTఒకవైపు కరోనా వైరస్‌తో వణికిపోతున్న ప్రజలను అకాల వర్షాలు మరింత దెబ్బతీస్తున్నాయి. గాలి, వానతో ఒక్కసారిగా బీభత్సం సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తూ అన్నదాతకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఏపీలో భారీ గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. కర్నూలు జిల్లాలో అధికశాతం వర్షపాతం నమోదుకాగా, నెల్లూరులో గాలివాన బీభత్సం అధిక నష్టాన్ని మిగిల్చింది. ఈ అకాల వర్షానికితోడు పిడుగు పాటుతో ఏపీలో 14మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరులో ఏడుగురు మృతిచెందగా, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే చేతికొచ్చిన పంట అకాల వర్షం కారణంగా నేలపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యాంతమవుతున్నారు.
Also Read :తెలంగాణలో 130 కరోనా హాట్‌స్పాట్లు
తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా సీసీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు లేఖ రాశారు. అకాల వర్ష బీభత్సంతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. వరి, పెసర, మిర్చి, మొక్కజొన్నతో పాటు ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అంచనా వేసి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదిలాఉంటే ఉంటే నేడూ, రేపు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.