ధనం నడిపించే ఇంధనం.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 11 Aug 2020 5:05 PM ISTడబ్బొక్కటే కాదు జీవితానికి పరమార్థం. సంపాదనే ప్రధానమనుకుంటే బంధాలు మాయమైపోతాయి.. ఇలా చాలామంది చాలా విధాలుగా చెబతున్న నీతివాక్యాలు మన అవసరాలను తీరుస్తాయా అంటే లేదనే సమాధానమే వస్తుంది. మనీ మనలో విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. వెన్నుముకను నిఠారుగా నిలబెడుతుంది. జేబులో వంద ఉంటే మన నడకే వేరుగా ఉంటుంది అనేవారు లేకపోలేదు. కానీ ప్రీతి ప్రతి స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం అత్యవసరం అంటున్నారు. రెండు మూడు కంపెనీలకు అధిపతిగా ప్రీతి స్త్రీ ఆర్థికంగా బలపడితే లభించే స్వేచ్ఛే నిజమైన స్వేచ్ఛ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇంతకూ ఆమె విజయగాధను ఓ సారి చూడండి మరి..!
మనల్ని ఆనందంగా ఉంచగల ప్రతి పనిని కచ్చితంగా చేయాలి అంటారు 49 ఏళ్ల ప్రీతి రథి గుప్తా. మోస్ట్ సక్సస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా గుర్తింపు పొందారు. పెళ్లయిన కొత్తలో చదువుకు ఏమాత్రం ఆటకం కలగకుండా చదివేశారు. తనకు తోచినవన్నీ చేయగలిగారు. ప్రస్తుతం ప్రీతి రథి గుప్తా.. ఇష్కా ఫిల్మ్స్ నిర్వహిస్తున్నారు. ఆనంద్ రథి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్. అలాగే ముంబైలో లక్ష్మి అనే సొంత కంపెనీ ఉంది. ఈ లక్ష్మి ద్వారా మహిళలకు పొదుపు ఎలా చేయాలో తగిన సలహాలిస్తుంటారు.
మగవాడు సంపాదించాలి.. స్త్రీ ఇంటి వ్యవహారాలు చూసుకోవాలి అన్న సంప్రదాయ వాదనకు పూర్తిగా విరుద్ధం ప్రీతి రథి సిద్ధాంతం. అసలు మగవాడి కన్నా స్త్రీ సంపాదిస్తేనే ఇల్లు మరింత సుఖంగా ఉంటుందంటారు. స్త్రీకి తెలిసినంత పొదుపు మంత్ర పురుషులకు తెలవదని చెబుతారు. ఈ మాట ఏదో నలుగురు కలిసినపుడు కాదు. ఏకంగా అఫిషియల్ బిజినెస్ మీటింగ్‌లలోనే చెబుతుంటారు. ఈ మాటల్ని ఏదో అదాటుగా కాకుండా నిందు ఆత్మవిశ్వాసంతోనే అంటారు. అపారమైన అనుభవంతో అంటారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్న ప్రీతి ఆడవాళ్లకు అత్యంత నమ్మకమైన స్నేహితురాలు ధనమేని వ్యాఖ్యానిస్తారు. అయితే ప్రీతికి మాత్రం డబ్బుతోపాటు మరో ఇద్దరు ఆత్మీయులున్నారు.. కవిత్వం, వర్షం. కవిత్వం అబ్బిన మాట కాబట్టే అలంకారయుక్తంగా ఉంటుంది.
మహిళగా మీరు ఏం తెలుసుకున్నారు.. లేదా నేర్చుకున్నారు అంటే.. మగవాళ్లకంటే మహిళలే డబ్బును గౌరవిస్తారు, కాపాడుతారు అంటూ టపీమని బదులిస్తారు. మరి ఈ డబ్బే స్త్రీని స్వతంత్రురాలిగా చేస్తుందా? ఎలా? అంటే ‘అసలు ఫెమినిజం అనే భావన డబ్బు ఉంటేనే వస్తుంది. స్వశక్తితో సంపాదించడం, కూడబెట్టడం లాంటి చర్యలు స్త్రీకి నాజీవితానికి నేనే కర్త కర్మ క్రియ’ అనే భావనను ప్రోది చేస్తుందని ఎంతో నమ్మకంగా వివరిస్తారు. ఏది ఏమైనా చేతిలో డబ్బుంటే ఆ ఆత్మవిశ్వాసమే వేరు. పురుషుడు చేతిలో డబ్బులాడుతుంటే తీరుతెన్ను లేకుండా ఖర్చు పెట్టేస్తుంటాడు. అదే స్త్రీ అయితే చక్కని ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తుంది. ఇది గొప్పలు చెప్పడం కాదు నా ఆనుభం చెబుతున్న మాట అంటారు ప్రీతిరథి గుప్తా!
ప్రీతి అన్నట్టుగానే తను స్థాపించిన లక్ష్మి కంపెనీకి నాలుగువేల మంది వినియోగదారులున్నారు. వారు నిరంతరం షేర్లు ఎప్పుడు కొనాలి, సొమ్ము ఎక్కడ మదుపు చేస్తే మంచిది తదితర ఆర్థిక సంబంధ సందేహాలు అడుగుతుంటారు. అంతేకాదు కస్టమర్లు చెబుతున్న మాటల్ని సలహాల్ని కూడా ప్రీతి విలువైనవిగానే స్వీకరిస్తుంటారు. చెప్పాల్సిన చోట చెప్పడమే కాదు వినాల్సిన చోట అంతే అణకువగా వినడం అనే శుభలక్షణం అలవరచుకున్నారు కాబట్టే అంచెలంచెలుగా శిఖరస్థాయికి ఎదిగారు.
చిన్ననాటి నుంచే ప్రీతిరథి బిజినెస్ టూర్‌లంటూ తండ్రి వెంట వెళ్ళేవారు. ఆమె తండ్రి ఆనంద్ రథి బిజినెస్ మేన్. ఆయన వ్యాపారనిమిత్తం ఏ ఊరు వెళితే కుటుంబం అక్కడికే కదిలేది. ముంబై నుంచి ఢిల్లీ , కోల్‌కతా, గుజరాత్ ఇలా పలుచోట్ల తిరగడం వల్ల ప్రీతిరథికి బాల్యం నుంచే స్వతంత్రభావాలు అలవడ్డాయి. పలు ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకుని వాటిని నేర్చుకున్నారు, మనీ రొటేషన్ అయ్యే అంశాలేంటో తండ్రి వ్యవహారాలను బట్టి అర్థం చేసుకునే వారు.
ఆ అనుభవం పెళ్ళయ్యాక బాగా కలిసొచ్చింది. తండ్రిలాగే తన భర్త బిజినెస్ చేయాలని కలలు కన్నారు. ఆయనను ఒప్పించి ఆ కలను నిజం చేసుకున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి డెస్కు ఆయనతో ప్రారంభింపజేశారు. దాన్ని లాభాల బాటలో నడిపారు. ఈ ప్రవాహం ఇలా సాగిపోతున్నప్పుడే ఉన్నట్టుండి ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ షురూ చేశారు. అయితే అందరికీ ఇదో వింతనిపించింది. పెట్టుబడి పెడితే కనీస లాభాలు వచ్చేలా చూసుకోవాలి అనే ప్రీతి ఉన్నట్టుండి సినిమా రంగం వైపు మళ్ళడం ఆశ్చర్యమే కాదు.. కాసింత ఆందోళన అనిపించింది కూడా!
ఎందుకంటే ఫిల్మీ దునియా తీరే అంత. అక్కడ డబ్బులు రాశి పోసినంత మాత్రాన రెట్టింపుగా చేతికి రావు. కళాతృష్ణ ఉండాలి. ప్రేక్షకుల మనసు పసిగట్టగల నేర్పుండాలి. అయితే మొదట్నుంచి కళలపై మక్కువ ఉన్నందున తనలో ఆ ఆలోచనలు రేకెత్తాయనే చెప్పాలి. బహుశా ఇది తల్లి వారసత్వమేమో! ప్రీతి తల్లి సినిమాలు చాలా ఇష్టంగా చూసేవారు. నచ్చిన సీన్లను కళ్ళకు కట్టినట్టు చెప్పేవారు. ఆ భావాలందిపుచ్చుకుందేమో ప్రీతి సినిమా వైపు అడుగులేశారు. ఇష్కా ఫిల్మ్స్ పేరిట ప్రొడక్షన్ ప్రారంభించారు ప్రీతి. 2015 లో వెయిటింగ్ సినిమా రిలీజ్ చేశారు. బాగుందనే టాక్ వచ్చింది. 2018లో కర్వాన్ తీశారు. అది కూడా మంచి మార్కులే తెచ్చుకుంది. సినిమాలు తీసినా చేతులు కాల్చుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ ప్రయాణం ఇలాగే నిరాటంకంగా సాగితే.. మంచి హిట్ సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి.
‘స్త్రీకి మెదడుంది దానికి కొన్ని ఆలోచనలుంటాయి. స్త్రీకి శరీరం ఉంది దానికి కొన్ని కోరికలుంటాయి...సుప్రసిద్ధ తెలుగు కథకులు చలం తరచూ అన్న మాటలివి. అయితే ప్రీతి కథ విన్న తర్వాత స్త్రీకి స్వేచ్ఛా కాంక్ష ఉంటుంది. ఆ కాంక్ష సఫలమవడానికి డబ్బులవసరం ఉంటుంది...అన్న మరో వాక్యాన్ని చేర్చాల్సి ఉంటుంది.