హైదరాబాద్‌: మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అపాస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషం తాగి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి రెండు రోజుల కోసం గదిని మారుతీరావు అద్దెకు తీసుకున్నాడు. అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న సైబరారబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో.. కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్‌ని మారుతీరావు హత్య చేయించాడు. ప్రణయ్‌ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్యవర్తులతో కూతురు అమృతకు మారుతీరావు అప్పట్లో రాయబారం పంపాడు. పీడీ యాక్ట్‌ కేసులో ఆరు నెలల క్రితం మారుతీరావు జైలు నుంచి విడుదల అయ్యాడు. అప్పటి నుంచి కూతురు అమృతను మారుతీరావు వేధింపులకు గురిచేస్తున్నాడు. అమృత ఫిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్‌చేసిన మిర్యాలగూడ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కూతురు దూరం అయ్యిందని మారుతీరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అయితే మారుతీరావు ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని అనుమానాలు ఉన్నాయి.

మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్‌ 14న మారుతీరావు అల్లుడు ప్రణయ్‌ను హత్య చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.