ఆందోళనకరంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
By సుభాష్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై తాజాగా ఆర్మీ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ప్రణబ్ డీప్ కోమాలోకి వెళ్లారని ప్రకటించారు. ఇప్పటి వరకు అందించిన వైద్య చికిత్సతో ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదని, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ మరింత పెరిగిందని వెల్లడించారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, బ్రెయిన్ సర్జరీ తర్వాత కరోనా బారిన పడిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఈనెల 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకింది. ప్రత్యేక వైద్యబృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.