కరోనాపై పోరులో.. వైద్యుల రక్షణ కోసం పీపీఈలు.. త్వరలో అందుబాటులోకి
By Newsmeter.Network
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి భారిన పడి అగ్రరాజ్యం అమెరికాతో సహా బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, చైనా ఇలా అన్ని దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ కరోనా వైరస్ తీవ్రత భారత్‌లోనూ ఎక్కువగానే ఉంది. ఇప్పటికే 4,200 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. 124 మంది మృతిచెందారు. ఆదివారం ఒక్కరోజే 27మంది ఈవైరస్ భారిన పడటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇదిలా ఉంటే కరోనా రోగులకు నిత్యం వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. ఈ వైద్య సిబ్బంది కోసం ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఉత్తర రైల్వే రూపొందించిన వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) త్వరలోనే అందుబాటులోకి తేనుంది.
Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…
రెండు పీపీఈ నమూనాలను గ్వాలియర్‌లోని తన పరిశోధనశాలలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆదివారం పరీక్షించినట్లు తెలిసింది. రక్తం, శరీరం నుంచి వెలువడే స్రావాలను ఈ రక్షణ దుస్తులు సమర్థంగా అడ్డుకుంటాయని తేల్చిన డీఆర్‌డీవో వాటి తయారీకి అనుమతినిచ్చినట్లు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఉత్తర రైల్వే రూపొందించనున్న రక్షణ దుస్తులు, సామాగ్రిని కరోనా రోగులకు చికిత్స చేసే రైల్వే ఆస్పత్రుల వైద్యులు ధరించనున్నారు. ఇదిలాఉంటే ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ చౌధరి మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజుకు 20 పీపీఈలను తయారు చేస్తున్నామని, వారంలో రోజుకు 100 పీపీఈలను రూపొందించే స్థాయికి చేరుకుంటామని ఆయన తెలిపారు.
Aslo Read :లాక్‌డౌన్ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?
ఇదిలా ఉంటే కరోనా రోగుల ప్రాణాల్ని కాపాడేందుకు భారతీయ రైల్వే చౌకైన వెంటిలేటర్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలోని రైలు కోచ్ ఫాక్టరీ (ఆర్‌సీఎఫ్)లో ఈ వెంటిలేటర్లను పెద్దఎత్తున తయారు చేయనుంది. ఈ సందర్భంగా కపుర్తలా ఆర్‌సీఎఫ్ జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా ఈవిషయంపై మాట్లాడుతూ.. అప్పటికే తమకు అందుబాటులో ఉన్న సామాగ్రిని ఉపయోగిస్తూ తయారు చేసిన నమూనాలను ఐసీఎంఆర్‌కు అనుమతికోసం పంపించామని, అనుమతి రాగానే రోజుకు 100 చొప్పున వెంటిలేటర్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కోదాన్ని రూ.10వేలకే అందిస్తామని ఆయన పేర్కొన్నారు.