అనుకున్న దానికన్నా భారీగా తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

By అంజి  Published on  6 April 2020 1:55 AM GMT
అనుకున్న దానికన్నా భారీగా తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

హైదరాబాద్‌: గ్రిడ్‌ గెలిచింది అంటూ ఈనాడు దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.. ఆదివారం రాత్రి ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా రాత్రి ఇళ్లలో లైట్లను ఆపేసిన ప్రజలు.. ఆ వెంటనే వాకిళ్లలో దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్‌ టార్చ్‌ లైట్‌లను వెలిగించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు జాతి అపూర్వంగా స్పందించింది. కరోనాపై పోరులో జాతి ఏకమై ఉందన్న సందేశాన్ని దేశ ప్రజలంతా చాటి చెప్పారు.

అంతకు ముందు కొందరు దేశ వ్యాప్తంగా లైట్లు ఒక్కసారి ఆఫ్‌ చేస్తే.. లోడ్‌ పెరిగి గ్రిడ్‌లు కుప్ప కూలే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని ఫేక్‌ న్యూస్‌లు ప్రచారాం చేశారు. మోదీ చెప్పిన మాటల కంటే నిపుణుల మాటే వినడం మేలంటూ హేళన చేశారు. ఇంకొందరిలో లైట్లు అర్పివేస్తే సాంకేతిక సమస్యలు తెలెత్తవా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పటికే అదంతా తప్పుడు ప్రచారం అని విద్యుత్‌ అధికారులు తేల్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసిన సమయంలో తెలంగాణ జెన్‌కో-ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విజయవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో వారిని సీఎం కేసీఆర్‌ అభినందించారు.

రాష్ట్రంలో ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్‌ డిమాండ్‌ అనుకున్న దానికన్నా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా తగ్గింది. ఇందులో సగానికిపైగా హైదరాబాద్‌లోనే తగ్గింది. రాత్రి 8.59 గంటలకు విద్యుత్‌ డిమాండ్‌ 7,480 మెగావాట్లు ఉండగా.. అది 9.09 సమయంలో 6,000 మెగావాట్లకు పడిపోయింది. 1500 మెగావాట్లు ఒక్కసారిగా తగ్గింది. తెలంగాణలో లైట్లు ఆర్పితే 300 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ తగ్గుతుందన్న కేంద్ర ప్రభుత్వ అంచనాను తలకిందులు చేసింది. తెలంగాణ ట్రాన్స్‌కో కూడా 600 నుంచి 1000 మెగావాట్లు తగ్గుతుందని అంచనా వేసింది.

అలాగే దేశ వ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడంతో 31.7 గిగావాట్ల మేర విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ తెలిపింది. రాత్రి 9 గంటలకు 117 గిగావాట్ల నుంచి 85.3 గిగావాట్లకు వచ్చింది. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో ఉన్న కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యాలయంలో అధికారులతో కలిసి కేంద్ర సహాయమంత్రి ఆర్‌కె.సింగ్‌ విద్యుత్‌ లోడ్‌ హెచ్చ తగ్గులను సమీక్షించారు.

Next Story