అమరావతి: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. విద్యుత్‌ ఛార్జీలను పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. యూనిట్‌కు 90 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 500 యూనిట్లకుపైగా విద్యుత్‌ వాడిన వారికి మాత్రమే ఈ ఛార్జీలు వర్తించనున్నాయి. చార్జీల పెంపు వల్ల ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేట్‌ సంస్థలపై కూడా భారం పడనుంది. రాష్ట్రంలోని 1.35 లక్షల గృహ వినియోగదారులపై ఈ భారం పడనుంది. టారిఫ్‌ను రూ.9.05 నుంచి రూ.9.95గా పెంచారు.

ఈ సందర్భంగా ఏపీఈఆర్సీ చైర్మన్‌ సీవీ నాగార్జునరెడ్డి మాట్లాడారు. ఈ సారి రాష్ట్ర తూర్పు, దక్షిణ విద్యుత్‌ సంస్థలకు రూ.14,349 కోట్ల ఆదాయం అవసరమవుతుంద్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వినియోగదారులకు రూ.2,893.48 కోట్ల ఆర్థిక భారం తగ్గిస్తూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు నికర లోటును రూ.10,060.30 కోట్లుగా నిర్దారించారు. ఈ లోటును భర్తీ చేసేందుకే విద్యుత్‌ ఛార్జీలను పెంచినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 9,500 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉందని తెలిపారు.

పెరిగిన విద్యుత్‌ ఛార్జీలపై అభ్యంతరాలు ఉంటే కోర్టులను ఆశ్రయించవచ్చని సీవీ నాగార్జున రెడ్డి తెలిపారు. విద్యుత్‌ సబ్సిడీలకు ఉపసంహరించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత నెలలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.

అంజి

Next Story