119 నియోజకవర్గాల్లో బరిలో YSRTP.. రెండు స్థానాల్లో షర్మిల పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు.

By Srikanth Gundamalla  Published on  12 Oct 2023 5:00 PM IST
YSRTP, Telangana, elections, YS Sharmila ,

119 నియోజకవర్గాల్లో బరిలో YSRTP.. రెండు స్థానాల్లో షర్మిల పోటీ

తెలంగాణలో నవంబర్‌ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తారనే ప్రచారం జరిగింది. ఆమె తన పార్టీనీ హస్తంలో విలీనం చేస్తారనుకున్నారు. కానీ.. తాజాగా ఆమె 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

వైఎస్‌ షర్మిల గురువారం వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నిర్వహించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌టీపీ బరిలోకి దిగుతుందని అన్నారు. ఈ మేరకు కార్యకవర్గ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. వైఎస్‌ షర్మిల పాలేరుతో పాటు మరో అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేయనున్నట్లు ఆమె చెప్పారు. అంతేకాదు.. వైఎస్‌ విజయమ్మ. అనిల్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారని చెప్పారు. అవసరమైతే విజయమ్మను ఎన్నికల్లో పోటీ చేస్తారని షర్మిల అన్నారు.

అయితే.. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవని అనుకున్నట్లు చెప్పారు షర్మిల. కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని.. నాలుగు నెలలు ఎదురుచూశామని అన్నారు. కానీ.. కొన్ని కారణాల వల్ల విలీన ప్రక్రియకు బ్రేక్‌ పడిందని చెప్పారు. దాంతో.. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనంపై షర్మిల కార్యవర్గ సమావేశంలో వివరించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు బీఫారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని పార్టీ నాయకులకు వైఎస్ షర్మిల సూచించారు. అయితే.. వైఎస్‌ షర్మిల పాలేరుతో పాటు మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story