కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల.. కేవీపీ రామచంద్రరావు ప్రకటన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు ప్రకటించారు.

By అంజి  Published on  3 July 2023 3:40 PM IST
YSRTP, YS Sharmila, Congress, KVP Ramachandra Rao

కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల.. కేవీపీ రామచంద్రరావు ప్రకటన

విజయవాడ: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు ప్రకటించారు. షర్మిల త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. కరడుగట్టిన కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె కావడంతో షర్మిలను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించామని రామచంద్రరావు చెప్పారు. 2004, 2009లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డికి కేవీపీ సన్నిహిత మిత్రుడు. ఖమ్మం సభ ముగించుకుని గత రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు.

రాహుల్‌తో భేటీకి ముందు, కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను వివరిస్తానని కేవీపీ మీడియా ప్రతినిధులతో అన్నారు. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2018లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి చవిచూసిందని కేవీపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగానాలు గత కొన్ని వారాలుగా చక్కర్లు కొడుతున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమెను నియమించబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను వైఎస్‌ఆర్‌టిపి నేత ఖండించారు. ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల కర్ణాటక నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ టిక్కెట్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. తెలంగాణ సాధనకు కట్టుబడి ఉన్నానని, ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు స్పష్టం చేశారు. “నేను ఎప్పుడూ తెలంగాణలోనే ఉన్నాను, నా చివరి శ్వాస వరకు తెలంగాణలోనే ఉంటాను. నా భవిష్యత్తు తెలంగాణాలో, అక్కడి ప్రజలతోనే ఉంది’’ అని ఆమె అన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు.

Next Story