అర్థరాత్రి షర్మిల దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
YSRTP chief YS Sharmila shifted to hospital.వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు
By తోట వంశీ కుమార్ Published on 11 Dec 2022 9:16 AM ISTవైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అర్థరాత్రి భగ్నం చేశారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె లోటస్ పాండ్‌లో శుక్రవారం నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం విషమిస్తుండడంతో శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులు లోటస్ పాండ్‌కు చేరుకుని బలవంతంగా ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అంతకముందు శనివారం ఉదయం దీక్ష చేస్తున్న షర్మిలను వైఎస్ విజయమ్మ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం పోలీసులు తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని, శనివారం సాయంత్రానికి కూడా విడుదల చేయలేదన్నారు.
పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టి సామాన్యులను లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఎమ్మెల్యే అవినీతి, అక్రమాను బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. పాదయాత్రలో ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదన్నారు. కేసీఆర్ దేశమంతా రాజకీయాలు చేసుకోవచ్చు. ఆయనకు అన్ని పరిష్మన్లు వస్తాయి. కానీ ప్రజల కోసం కొట్టాడే మా పార్టీపై మాత్రం దాడులా..? అని మండిపడ్డారు. తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేశారు.