ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. అదే ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల నేడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కీలక సమావేశం గురించే. ఆమె తెలంగాణాలో కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారని.. అందుకనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని కొందరు చెబుతున్నారు. దీంతో ఈ సమావేశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి వైసీపీ నేతలతో పాటు వైఎస్ఆర్ అభిమానులు, ఆయన సన్నిహితులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఆమె వెంట ఉన్న ముఖ్యులను కూడా ఈ సమావేశానికి పిలిచినట్లు సమాచారం.
బెంగళూరు నుంచి బయలుదేరనున్న షర్మిల.. ఉదయం 10 గంటల తరువాత హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ కు చేరుకుని, అభిమానులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇవి కేవలం ఆత్మీయ సమావేశాలేనని షర్మిల వర్గం చెబుతున్నా, కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా, టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీల్లో క్రియాశీలకంగా లేని నేతలతో షర్మిల వర్గం గత వారం రోజులుగా సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానుండగా.. ఇప్పటికే సూర్యాపేట, భువనగిరి తదితర ప్రాంతాలకు చెందిన వైఎస్ అభిమానులు హైదరాబాద్ కు చేరుకున్నారు.
అనంతరం తెలంగాణలోని ఇతర జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ప్రతి రెండు రోజులకు ఒక ఉమ్మడి జిల్లా సమావేశం జరుగుతుందని, అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత కొన్ని పర్యటనలు ఉంటాయని చెబుతున్నారు. అయితే.. దీనిపై షర్మిల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. నేడు దాదాపు 150 మందితో షర్మిల సమావేశం అవుతున్నారని తెలుస్తుండగా, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురికి కూడా ఫోన్లు వెళ్లాయి. ఫిబ్రవరి 9 రాజశేఖర్ రెడ్డి పెళ్లిరోజు కావడంతోనే మంగళవారం తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.