నా మీద దాడి జరిగితే కేసీఆర్‌దే బాధ్యత : ష‌ర్మిల‌

YS Sharmila meets Governor Tamilisai.వైఎస్ ష‌ర్మిల తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ ను క‌లిశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2022 9:10 AM GMT
నా మీద దాడి జరిగితే కేసీఆర్‌దే బాధ్యత : ష‌ర్మిల‌

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ ను గురువారం రాజ్‌భ‌వ‌న్‌లో క‌లిశారు. పోలీసుల వైఖ‌రిపై గ‌వ‌ర్న‌ర్‌కు ష‌ర్మిల ఫిర్యాదు చేశారు. అనంత‌రం ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ డైరెక్ష‌న్‌లోనే ఇదంతా జ‌రిగింద‌ని వైఎస్ షర్మిల ఆరోపించారు. స‌ర్వేల్లో మా పార్టీకి చాలా ఆద‌ర‌ణ ఉంద‌ని తేల‌డంతో టీఆర్ఎస్ భ‌య‌ప‌డుతోంద‌న్నారు. కావాల‌నే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను సృష్టించార‌న్నారు. పాద‌యాత్ర‌ను ఆపేందుకు కుట్ర చేశార‌ని మండిప‌డ్డారు. పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డం, దాడి ఘ‌ట‌న‌పై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు.

కేసీఆర్ ఓ నియంత‌లా రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌న్నారు. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిల‌బెట్టుకోలేద‌ని చెప్పారు. రాష్ట్రంలో ల‌క్ష‌ల కోట్ల అవినీతి జ‌రుగుతోంద‌న్నారు. కేసీఆర్ కుటుంబం ల‌క్ష‌ల కోట్లు సంపాదించింద‌ని దుయ్య‌బ‌ట్టారు. మిగులు బ‌డ్జెట్ రాష్ట్రాన్ని దివాలా తీయించార‌ని ఆరోపించారు. కేటీఆర్‌, క‌విత ఇళ్ల‌లో సోదాలు జ‌ర‌గాల‌న్నారు. డ‌బ్బులు సంపాదించ‌డం త‌ప్ప టీఆర్ఎస్ నేత‌లు ఏమీ చేయ‌లేద‌న్నారు.

కొద్ది రోజులుగా టీఆర్ఎస్ నేత‌లు మాపై బెదిరింపుల‌కు దిగుతున్నారు. పాద‌యాత్ర‌లో చేస్తే దాడులు చేస్తామ‌ని హెచ్చరిస్తున్నారు. నాకేమైనా జ‌రిగినా, నా కార్య‌క్త‌ర‌ల‌కు ఏమైనా జ‌రిగినా కేసీఆర్‌దే పూర్తి బాధ్య‌త అని ష‌ర్మిల అన్నారు.

Next Story