ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్!
ఏపీలో రానున్న కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 11:07 AM ISTఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్!
ఏపీలో రానున్న కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అందులో కాంగ్రెస్ పార్టీ విజయం సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల పోటీ చేస్తారనీ అందరూ భావించినా.. ఆమె బరిలోకి దిగలేదు. పైగా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. ఆ తర్వాత అందరూ అనుకున్నట్లుగానే రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో తన వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఇక ఇటీవలే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏఐసీసీ షర్మిలను ప్రకటించింది. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకునేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది.
ఇడుపులపాయలో తండ్రి వైఎస్‌ఆర్ సమాధి దగ్గరే షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జనవరి 21న జరగబోయే ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఏపీసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారానికి వైఎస్ఆర్ అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున హాజరుకాన్నారు. షర్మిలకు రాష్ట్రంలో మద్దతు ఉందనే విషయాన్ని తెలపనున్నారు.
ఏపీలో కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల ఎదుట పెద్ద సవాళ్లే ఉండే అవకాశం ఉంది. ఒక వైపు సొంత అన్నతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌టీపీపై తీవ్ర విమర్శలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇక మరోవైపు ప్రతిపక్షపార్టీ టీడీపీ జనసేనతో కలిసి ముందుకు వస్తోంది. బలంగా ఉన్న ప్రతిపక్షాలను షర్మిల ఏ విధంగా ఢీకొంటుందనేది ఆసక్తిగా మారింది. ఇక మరోవైపు ఇన్నాళ్లు తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్సార్ పాలన తెస్తానని చెప్పిన షర్మిల.. సడెన్‌గా ఏపీకి వెళ్తుండటంతో అక్కడి ప్రజలు ఎలా తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశం అవుతోంది.
ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల తన కార్యాచరణను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఆమె నేరుగా ప్రజల్లోకి వెళ్తారని రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయమే ఉన్న కారణంగా రాష్ట్రవ్యాప్త పర్యటనల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం సహా విభజన హామీలపై ప్రచారం చేయనున్నారు. ఇవన్నీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రజల్లో వివరిస్తారని పార్టీ వర్గాలు చెబతున్నాయి.