కడప లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 March 2024 10:58 AM ISTకడప లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే లోక్‌సభతో పాటు... ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి. దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి కూడా. కాంగ్రెస్ మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. ఇంకా లిస్ట్‌ను మాత్రం విడుదల చేయలేదు.
ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల చురుగ్గా పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కలియతిరుగుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార, విపక్ష పార్టీలపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే.. షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా షర్మిలను కాంగ్రెస్ పార్టీ కడప లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని చూస్తోందట. వైఎస్ షర్మిల అభ్యర్థుల ప్రకటన మొదలుపెట్టాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కడప లోక్‌సభ నుంచి షర్మిలను దించడం వెనుక కారణం లేకపోలేదు. వైసీపీని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో పాటు.. జగన్‌ను ఇరకాటంలో పెట్టాలనే కడపలో బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం.
ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం షర్మిలపై కూడా ఒత్తిడి పెంచిందట. ఏఐసీసీ నేతలే రంగంలోకి దిగి పోటీ చేయాలని చెప్పడంతో కాదనలేక కడప ఎంపీగా పోటీ చేసేందుకు షర్మిల ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు కానీ.. కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇందులో తొలి పేరు షర్మిలదే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక మార్చి 19న సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చే చాన్స్ ఉంది.