ఏపీలో వైఎస్ షర్మిల పర్యటన షెడ్యూల్ ఖరారు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 8:49 AM GMTఏపీలో వైఎస్ షర్మిల పర్యటన షెడ్యూల్ ఖరారు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె ఇప్పుడు ఇక బాధ్యతలు స్వీకరించాల్సి మాత్రమే ఉంది. కాగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ షర్మిల పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది.
ఈ నెల 20వ తేదీ నుంచి వైఎస్ షర్మిల ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 20, 21 తేదీల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 20న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు షర్మిల ఇడుపులపాయకు బయల్దేరుతారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పించనున్నారు. ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు వైఎస్ షర్మిల. ఇక ఈ నెల 21వ తేదీన కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఉదయం 10 గంటలకు వెళ్తారు. విజయవాడలో ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకోనున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం అవుతారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చిస్తారు వైఎస్ షర్మిల.
కాగా.. తెలంగాణ వైఎస్సార్‌టీపీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక కొద్దిరోజుల పాటు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందో అనే ఉత్కంఠ కొనసాగింది. కానీ అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏపీ బాధ్యతలను అప్పగించింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియామకం కావడం ఆసక్తిని రేపుతోంది. అధికార పార్టీ వైసీపీ, తన అన్న సీఎం జగన్‌ను ఎలా ఎదుర్కొనబోతుందనేది ఉత్కంఠ నెలకొంది. కాగా.. షర్మిలకు పదవి అప్పగించకముందే ఏపీసీసీ చీఫ్‌గా ఉన్న రుద్రరాజుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పార్టీ అధిష్టానం నియమించింది.