'అభివృద్ధిపై చర్చకు నేను రెడీ'.. లోకేష్‌కు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సవాల్
పల్నాడులో రాజకీయం హిటెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురకుంటున్నాయి. ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచుతోంది.
By అంజి Published on 10 Aug 2023 7:00 AM IST'అభివృద్ధిపై చర్చకు నేను రెడీ'.. లోకేష్‌కు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సవాల్
పల్నాడులో రాజకీయం హిటెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురకుంటున్నాయి. ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచుతోంది. ఎన్నికలు మరికొన్ని నెలలే ఉండటంతో పల్నాడు జిల్లాలో టీడీపీ, వైసీపీ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ విమర్శలు కురిపించారు. తన సెల్ఫీ ఛాలెంట్‌కు సమాధానం చెప్పే దమ్ములేక లోకేష్ పారిపోయాడని విమర్శించారు. వైసీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్‌కు కాసు మహేష్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.83 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అంగన్‌వాడీలు, కమ్యూనిటీ హాళ్లని రూ.2020 కోట్లతో నిర్మించానని లోకేష్ అబద్ధాలు చెప్పాడని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ లోని ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.300 కోట్లు పెట్టి ఇళ్లు కట్టుకున్నాడని... ఇది సారా డబ్బులతోనే కట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలను లూటీ చేసి చంద్రబాబు, లోకేష్ డబ్బులు సంపాదించారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇంటి పేరు నారా కంటే సారా అంటేనే సరిగ్గా ఉంటుందని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో లిప్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయినా చేయించారా? అంటూ మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. అవినీతికి చక్రవర్తి అయిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ సీఎం జగన్, తనపైనా అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్, వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ పై అవినీతి ఆరోపణలు చేశారు.
అయితే లోకేష్ చేసిన ఆరోపణలను తాజాగా కాసు మహేష్ రెడ్డి తిప్పికొట్టారు. లోకేష్, యరపతినేని శ్రీనివాసురావులు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2014లో రూ.50 కోట్ల అవినీతి డబ్బుతో గుంటూరులో ఇల్లు కట్టుకున్నారని, మరుగుదొడ్ల నిధులు సైతం కాజేసిన చరిత్ర యరపతినేనిదని అన్నారు. నరసరావుపేటలో తాము కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్, బ్యాంక్ లోన్ తీసుకుని కాసు బ్రహ్మానందరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్మిస్తున్నామని తెలిపారు. కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయంతో కళాశాల, పాఠశాలల నిర్వహణకు ఖర్చు చేస్తామే తప్ప, అది తమ సొంత ఆస్తి కాదని తెలిపారు. నారా లోకేష్ గురజాల నియోజకవర్గంలోకి వచ్చాడు, వెళ్లాడు.. ఆయన పాదయాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. యరపతినేని, లోకేశ్ లాంటి మూర్ఖులు ఉంటేనే జగన్ లాంటి నాయకుడి విలువ జనాలకు తెలుస్తుందని ఆయన అన్నారు.