ముందస్తుకు సీఎం జగన్‌ మొగ్గు.. డిసెంబర్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది చివరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఏపీ బరిలోకి దిగనుందని తెలుస్తోంది.

By అంజి  Published on  6 July 2023 1:45 AM
YCP government, early elections, APnews

ముందస్తుకు సీఎం జగన్‌ మొగ్గు.. డిసెంబర్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది చివరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఏపీ కూడా ఎన్నికల బరిలోకి దిగనుందని తెలుస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ఢిల్లీ టూర్‌ ప్రీ పోల్స్‌ సంకేతాలను ఖాయం చేసిందని చెబుతున్నాయి. ఢిల్లీ టూర్‌లో భాగంగా సీఎం జగన్‌ మొదట కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. ఆయనతో ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత ప్రధాని మోదీని కలిసిన వైఎస్‌ జగన్‌ దాదాపు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. పోలవరం, రాష్ట్రానికి నిధులు, పెండింగ్ పనులు వంటివన్నీ చర్చించినట్లు చెబుతున్నారు.

అయితే అసలు చర్చ ముందస్తు ఎన్నికలపై జాతీయ మీడియా పేర్కొంటోంది. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ శ్రేణులకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ లోగా యూనిఫామ్‌ సివిల్ కోడ్‌ని పార్లమెంట్‌లో ఆమోదించి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. దీనివల్ల మళ్లీ హిందూ ఓట్లను పూర్తి స్థాయిలో సంపాదించుకోవచ్చని అనుకుంటోంది. ఈ చట్టంపై కూడా లోక్‌సభలో, రాజ్య సభలో వైసీపీ మద్దతు కోరినట్లు తెలిసింది. సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ముందస్తుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99.5 శాతం నెరవేర్చినట్లు సీఎం జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఉద్యోగుల అసంతృప్తిని తొలగించేలా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, సీపీఎస్‌ స్థానంలో గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌లాంటి ప్రకటనల ద్వారా జగన్‌ ఆ వర్గాల ఓట్లపై కూడా పూర్తి నమ్మకంగా ఉన్నారు. మరోవైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం పక్కా అని, సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఇదే అంశంపై మాట్లాడినట్టు తెలిసిందని ఎంపీ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఒకటిరెండు రోజుల్లో దీనిపై అదనపు సమాచారం బయటకు వస్తుందని అన్నారు.

Next Story