మళ్లీ ఆ పొత్తు పొడిచేనా?
Will that alliance be struck again.పాత స్నేహం మళ్లీ చిగురిస్తుందా? ఎన్నికల కోసం కలవబోతున్నారా అనే అంశం తెలుగు
By సునీల్
- బీజేపీ, టీడీపీ నేతల రహస్య ప్రయత్నాలు
- చంద్రబాబుతో భేటీకి సై అన్న షా?
- కీలక నేతలకూ అందని సమాచారం
పాత స్నేహం మళ్లీ చిగురిస్తుందా? ఎన్నికల కోసం కలవబోతున్నారా అనే అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలోని మునుగోడు బహిరంగ సభకు హాజరయ్యేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. షా పర్యటనలో రిజర్వుడ్ పేరిట కొంత సమయం కేటాయించారు. ఈ సమయంలో ఎవరిని కలుస్తారు, ఎక్కడకు వెళ్తారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
షా షెడ్యూల్లో రిజర్వ్ చేసిన సమయంలో అమిత్ షా, చంద్రబాబుల భేటీ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీలో కీలక స్థాయి నేతలకూ ఆ విషయంపై స్పష్టత లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో పొత్తుతో టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాలుగేళ్లపాటు పొత్తు కూడా బానే సాగింది. కేంద్రంలో 2 మంత్రి పదవులు టీడీపీ, ఏపీలో 2 మంత్రి పదవులు బీజేపీకి పొత్తులో కేటాయించారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు విభజన హామీలు అమలు చేయడం లేదంటూ టీడీపీ రివర్స్ అయింది. అలాగే నిధుల కేటాయింపులపైనా విమర్శలు చేసింది. పొత్తు నుంచి తప్పుకొని వైసీపీ కన్నా బీజేపీయే ప్రతిపక్షం అన్నట్లుగా వ్యవహరించింది.
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీ చల్లని చూపుల కోసం పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో పార్టీ నామరూపాల్లేకుండా పోవడంతో ఆశలన్న ఏపీపైనే ఉన్నాయి. అధికార వైసీపీ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వస్తోంది. పార్టీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ బీజేపీకి అడగకుండానే మద్దతిస్తున్న పరిస్థితి ఉంది. టీడీపీకీ తప్పని పరిస్థితి కావడంతో బీజేపీకే మద్దతిస్తూ వస్తోంది.
ఇలాంటి రాజకీయ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో షా- బాబుల కలయిక జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలెవరూ ధ్రువీకరించనప్పటికీ హైదరాబాద్‌లో భేటీ జరగవచ్చని చెబుతున్నారు.
వైసీపీ బీజేపీకి అనుకూలంగా ఉన్న సమయంలో అమిత్ షా చంద్రబాబుతో భేటీకి చాన్స్ ఇవ్వడంపై పలు ప్రచారాలు జరుగుతున్నాయి. బీజేపీ నిర్వహించిన సర్వేలో టీడీపీ గ్రాఫ్ పెరిగినట్లు వచ్చిందంటున్నారు. జనసేన ఎలాగూ బీజేపీతో పొత్తులోనే ఉంది. కనుక టీడీపీతో కూడా స్నేహంగా ఉంటే నష్టమేం ఉందని అంటున్నారు. అంతర్గత సర్వేలో టీడీపీ గ్రాఫ్ పెరిగినా బలంగా ఉన్న వైసీపీని గెలవడం కేక్ వాక్ ఏమీ కాదు. అయితే మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే 2014 కన్నా ఎక్కువ సీట్లే వస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి. పొత్తుతో ఎన్నికలకు వెళ్లి గెలిస్తే, బీజేపీ చేతిలో ఉన్న రాష్ట్రాల సంఖ్యలో మరొక అంకె పెరుగుతుందనే ఆలోచన ఉందంటున్నారు.