ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించిన మర్రి శశిధర్ రెడ్డి

Welcoming The formation of new districts in AP says Shashidhar Reddy.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jan 2022 3:40 AM GMT
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించిన మర్రి శశిధర్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రి మండ‌లి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడున 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీనిని కొంద‌రు స్వాగ‌తిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు రాజ‌కీయ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉండేవన్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974లోని నిబంధనల ప్రకారం.. మొత్తం జిల్లాల సంఖ్యను 26కి తీసుకొని 13 కొత్త జిల్లాలను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించిందన్నారు.

మెరుగైన పరిపాలన వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రయోజనాల కోసం జిల్లాల ప్రాంతాలు లేదా సరిహద్దుల మార్పుకు వీలు కల్పించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారని చెప్పారు. కొత్త జిల్లాల మధ్య అసెంబ్లీ స్థానాలస్థానాల సంఖ్య, ఇతర అంశాల పరంగా కొంత కొంత సమానత్వం ఉండేలా సహేతుకమైన కసరత్తు జరిగిందని, భౌగోళిక ప్రాంతాలు, జనాభాకు కూడా వెయిటేజీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు శశిధర్‌రెడ్డి చెప్పారు. విజయవాడ జిల్లా కి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టె ప్రతిపాదన చేయడంతో కులతత్వ రాజకీయాలను గట్టిగా ప్రోత్సహించిన వైఎస్సార్‌సీపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలో కొంతమేరకు మార్పు కనిపించిందన్నారు. పుట్టపర్తిని కేంద్రంగా కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడం కూడా చాలా స్వాగతించదగిన అంశమన్నారు.

తెలంగాణలో జిల్లాల సంఖ్యను కూడా సీఎం కేసీఆర్ 2016లో 10 నుంచి 31 కి, చివరకు 33 కి పెంచారు. ఏపీలో ప్రతిపాదించిన దానికి భిన్నంగా తెలంగాణలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా సీఎం కేసీఆర్ కేవలం తన ఇష్టారాజ్యంగా చేశారన్నారు. ఫలితంగా జిల్లాల మధ్య చాలా అసమానతలు ఉన్నాయి, వాటిలో కొన్ని మెరుగైన పరిపాలన మరియు అభివృద్ధి అనే ప్రాథమిక లక్ష్యం నెరవేరకుండా చాలా అధ్వాన్నంగా మారాయని విమర్శించారు. చిన్న జిల్లాలతో రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరచడం, వారి ప్రభావాన్ని తగ్గించడం ప్రధానలక్ష్యంగా ఉన్నట్లు స్పష్టంగా కనబడిందని శశిధర్‌రెడ్డి తెలిపారు.

గతంలో 1980లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కర్నూలు గుంటూరు జిల్లాల నుండి కొంత విస్తీర్ణాన్ని కలుపుకొని ప్రకాశం జిల్లాను, విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల నుండి కొంత విస్తీర్ణాన్ని కలుపుకొని విజయనగరం జిల్లాని ఏర్పాటు చేశారన్నారు. అప్పుడున్న హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేశారని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు శశిధర్‌రెడ్డి చెప్పారు.

Next Story