బీజేపీలో రాములమ్మకు అవమానాలు..ఆ జాబితాలోనూ దక్కని చోటు
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 6:15 PM ISTబీజేపీలో రాములమ్మకు అవమానాలు..ఆ జాబితాలోనూ దక్కని చోటు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీలో ఉన్న విజయశాంతికి పెద్దగా గుర్తింపు దక్కడం లేదనే చెప్పాలి. వరుసగా ఆమెకు అవమానాలే ఎదురవుతున్నాయి. తెలంగాణ కోసం పోరాడిన మహిళా నాయకురాలిగా విజయశాంతికి పేరుంది. కానీ ఇప్పుడు ఆమె ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రాములమ్మ రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది. అయితే.. ఆమె మూడేళ్ల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో విజయశాంతి ఎంపీగా ఒకసారి మాత్రమే గెలిచారు. ఆ తర్వాత 2014లో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిని చవి చూశారు. ఇక ఈసారి అయినా బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందని అందరూ అనుకుంటుంటే.. పార్టీ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ మూడు విడతలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ.. ఒక్కదాంట్లో కూడా ఆమెకు స్థానం దక్కలేదు. ఇక బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ 8 స్థానాల్లో పోటీకి దిగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన 23 స్థానాలు బీజేపీ మిగిలి ఉంటాయి. మరి అందులో అయినా రాములమ్మకు చోటు దక్కుతుందా అని చర్చజరుగుతోంది.
మరోవైపు తాజాగా తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎలాగూ ఆమెకు అభ్యర్థిగా అవకాశం కల్పించలేదు. పైగా ఆమె మంచి గుర్తింపు ఉన్న లీడర్. కనీసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అయినా రాములమ్మ పేరు ఉంటుందనుకుంటే.. అక్కడ కూడా హ్యాండ్ ఇచ్చారు. రాష్ట్ర నాయకుల పేర్లు చాలా మందివి ఉన్నా.. అసలు పెద్దగా గుర్తింపు లేనివారి పేర్లు కూడా కనిపించినా.. సినీ గ్లామర్‌తో పాటు పొలిటికల్‌గా ఫాలోయింగ్ ఉన్న విజయశాంతికి మాత్రం అందులో చోటు దక్కలేదు. దాంతో.. విజయశాంతి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరికో అవకాశాలు ఇస్తున్నారు కానీ.. గుర్తింపు ఉన్న విజయశాంతికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు కల్పించకపోవడం ఆమెను అవమానించడమే అంటూ మండిపడుతున్నారు.
కాగా.. బీజేపీ తెలంగాణ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో 40 మంది నాయకుల పేర్లను వెల్లడించింది. ప్రధాని మోదీతో నుంచి మొదలు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి అగ్ర నాయకులు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఇక తెలంగాణకు చెందిన నేతల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్ పేర్లతో పాటు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురందేశ్వరి పేరు కూడా ఉంది.