నేనేం తప్పు చేశా..నన్నెందుకు బలి చేశారు: ఉప్పల్ ఎమ్మెల్యే

అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి.

By Srikanth Gundamalla  Published on  29 Aug 2023 2:30 PM IST
Uppal, MLA Subhash Reddy, BRS, Telangana,

నేనేం తప్పు చేశా..నన్నెందుకు బలి చేశారు: ఉప్పల్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులను ప్రకటించిన వారం రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి. అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు.

ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆగస్టు 29న కుటుంబం, అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక ఉద్యమకారుడు తానే అని చెప్పారు. అలాంటిది నగరంలోని తన ఒక్క సీటును కూడా తొలగించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 2001 నుంచి పార్టీలో ఉన్నానని, తన తర్వాత వచ్చిన పద్మారావు గౌడ్‌ మంత్రి అయ్యారని అన్నారు. తాను మాత్రం పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ అలాగే ఉండిపోయానని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు పడి ఉప్పల్‌లో పార్టీని కాపడానని అన్నారు బేతి సుభాష్‌రెడ్డి. ఎవరైనా ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు పెంచుకుంటారు.. కానీ అందరిలా కాదని, ఆస్తులు అమ్ముకుని ప్రజలకు మంచి చేశానని అన్నారు. కానీ.. అడ్డగోలుగా సంపాదించుకున్న వారికే టికెట్లు కేటాయించారని సుభాష్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఉప్పల్‌ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ టికెట్‌ బండారు లక్ష్మారెడ్డికి ఎలా ఇస్తారని బేతి సుభాష్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఏం జెండా మోశారని నిలదీశారు. కాంగ్రెస్‌ నేతల ఫొటోలను పెట్టుకున్న వ్యక్తి బండారు లక్ష్మారెడ్డి అని.. ఆయనకు టికెట్‌ కేటాయించడాన్ని తప్పుబట్టారు. అసలు ఉప్పల్‌ అభ్యర్థిని ఎంపిక చేసే విషయం పార్టీ నాయకులు తనతో కనీసం మాట్లాడలేదని ఆవేదన చెందారు. తాను ఏం తప్పు చేశానని.. ఎందుకు బలి చేశారంటూ ప్రశ్నించారు. టికెట్‌ ఇవ్వనందుకు నిరసన చేద్దామని.. రోడ్డు ఎక్కుదామని కుటుంబ సభ్యులు అడిగారని.. క్యాడర్‌ కూడా ఆందోళన చేస్తామని చెప్పిందన్నారు. కానీ.. మనం పార్టీలో ఉన్నామని.. అలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించినట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చెప్పారు.

ఇక బీఆర్ఎస్‌ అభ్యర్థిగా మరొకరిని ప్రకటించాక కూడా... అధిష్టానం తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. ఇక ఏ పార్టీ నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. ఇక మరో వారం రోజుల పాటు వేచి చూసి.. అధిష్టానం ఉంచి ఎలాంటి పిలుపు రాకపోతే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రకటించారు.

Next Story