యూపీలో కొన‌సాగుతున్న ఐదో ద‌శ పోలింగ్‌.. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 8.02 శాతం ఓటింగ్

UP Polls 2022 Phase 5 Voting Updates.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ఆదివారం ఐదో ద‌శ పోలింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2022 5:07 AM GMT
యూపీలో కొన‌సాగుతున్న ఐదో ద‌శ పోలింగ్‌.. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 8.02 శాతం ఓటింగ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ఆదివారం ఐదో ద‌శ పోలింగ్ కొన‌సాగుతోంది. 12 జిల్లాల్లోని 61 స్థానాల‌కు గాను 692 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలుచున్నారు. దాదాపు 2.24 కోట్ల మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్‌ కంచుకోటలు అయిన‌ అమేథీ, రాయ్‌బరేలీ సహా రామమందిర ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న అయోధ్యలో కూడా నేడు పోలింగ్ జ‌రుగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

ఐదో ద‌శలో ఉప ముఖ్య‌మంత్రి కేశవ్‌ప్ర‌సాద్ మౌర్య స‌హా ప‌లువురు మంత్రులు పోటీలో ఉన్నారు. ఇక ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. ఈ క్ర‌మంలో పోలింగ్ ప్రారంభ‌మైన రెండు గంట‌ల్లో అంటే ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 8.02 శాతం పోలింగ్ న‌మోదు అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఐదో దశ యూపీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లందరినీ ప్రధాని మోదీ కోరారు. 'ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో ఐదవ దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాను' అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 403శాస‌న‌స‌భ స్థానాలు ఉండ‌గా.. ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే నాలుగు ద‌శ‌ల్లో 231 స్థానాల‌కు పోలింగ్ పూర్తి అయింది. ఐదో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ నేడు కొన‌సాగుతుండ‌గా.. మ‌రో రెండు ద‌శ‌ల పోలింగ్ మార్చి 3, 7 తేదీల్లో జ‌ర‌గ‌నుంది. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించనున్నారు.

Next Story