ధాన్యం కొనుగోలుపై ట్వీట్ల యుద్ధం

TRS VS Congress twitter war over Paddy Issue.తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్ల‌పై పార్టీల మ‌ధ్య మాట‌ల‌యుద్ధం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2022 11:58 AM IST
ధాన్యం కొనుగోలుపై ట్వీట్ల యుద్ధం

తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్ల‌పై పార్టీల మ‌ధ్య మాట‌ల‌యుద్ధం న‌డుస్తూనే ఉంది. ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన‌ ట్వీట్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం సంఘీభావం చెప్ప‌డం స‌రికాద‌న్నారు.

'రాహుల్ గాంధీ గారు మీరు ఎంపీగా ఉన్నారు. రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్‌లో సంఘీభావం తెలుపడం కాదు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల‌కు ఒక నీతి, ఇత‌ర రాష్ట్రాల‌కు మ‌రో నీతి ఉండ‌కూడ‌ద‌ని టీఆర్ఎస్‌ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి త‌మ నిర‌స‌న‌లు తెలియ‌జేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయండి. ఒక దేశం ఒకే సేక‌ర‌ణ విధానం కోసం డిమాండ్ చేయండి' అని ఎమ్మెల్సీ క‌విత అన్నారు.

ఎమ్మెల్సీ క‌విత ట్వీట్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంట‌రిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదని, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారన్నారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!? అని ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ధాన్యం కొనుగోలు విష‌యంలో టీఆర్ఎస్‌, బీజేపీ ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగగా.. తాజాగా ఇప్పుడిది కాంగ్రెస్‌, టీఆర్ఎస్ గా మారింది.

Next Story