రేపు మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ.. ఆశావహుల ఫ్లెక్సీల జోరు
TRS Public Meeting in Munugode on August 20.మునుగోడు చుట్టే ప్రస్తుతం తెలంగాణ రాజకీయం తిరుగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2022 9:33 AM GMTమునుగోడు చుట్టే ప్రస్తుతం తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి తమ సత్తా చూపించాలని అన్ని పార్టీలు బావిస్తున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనప్పటికీ ఇప్పటి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాయి పార్టీలు.
ఈ క్రమంలో శనివారం(ఆగస్టు 20న) మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు మునుగోడులో మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో జనసమీకరణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ పార్టీ నేతలు.
నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, క్రియాశీల నాయకులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి గ్రామాలు, వార్డుల వారీగా జనసమీకరణ పై దిశానిర్దేశం చేశారు.
టీఆర్ఎస్ సభ మరుసటి రోజు అంటే ఆదివారం(ఆగస్టు21న) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మునుగోడులో బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతుండగా కాంగ్రెస్ కు ఇటీవల రాజీనామా చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు బీజేపీలో చేరనున్నారు. దీంతో బీజేపీ సభను దృష్టిలో ఉంచుకుని జనసమీకరణను టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
టీఆర్ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో ఆశావహుల ఫెక్సీలు జోరుగా వెలిశాయి. మునుగోడు టికెట్ ఆశిస్తున్న నేతలు అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు మొదలు కొని బహిరంగ సభ వరకు ఏర్పాటు చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణా రెడ్డి పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం.
బహిరంగ సభ వేదికపై నుంచి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థిని ప్రటిస్తారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అభ్యర్థి విషయంలో ఇప్పటికే అధిష్టానం పక్కా క్లారిటితో ఉన్నట్లు తెలుస్తోంది. వారు చెబుతున్నట్లుగానే సీఎం కేసీఆర్ మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ప్రకటిస్తే ఆ అభ్యర్థి ఎవరు..? అనే దానిపై ఆసక్తి నెలకొంది.