ఈటలపై టీఆర్ఎస్ నాయకుల మాటల తూటాలు..!
TRS Leaders Fire On Etela Rajendar. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
By Medi Samrat Published on 4 May 2021 3:37 PM ISTతెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కావాలనే భూ కబ్జాల కేసులు ఈటలపై మోపబడ్డాయని ఆరోపణలు వస్తూ ఉండగా.. ఈటల అమాయకుడు అంటూ మరో వర్గం ఆరోపిస్తోంది. ఈటల తాను ఏ తప్పు కూడా చేయలేదని చెబుతూ ఉన్నారు. టీఆర్ఎస్ ఈటలను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈటల కూడా కేసీఆర్ పైనా.. ఆయన కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తనది ఆత్మగౌరవ ఉద్యమమని ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే నాపై నిందలు వేస్తున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసం కాదని.. తాను ఎంగిలి మెతుకుల కోసం ఆశపడనని చెప్పుకొచ్చారు. 2014కు ముందు పాలకులు ప్రలోభాలకు లొంగిపోయి పాలన కొనసాగించారని, ప్రజల కోసం కాకుండా అధికారం కోసమే పాకులాడారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కూడా అచ్చం అదే రీతిలో పాలన కొనసాగుతోందని ఈటల రాజేందర్ విమర్శించారు. అన్ని వ్యవహారాలు ప్రజాస్వామ్యయుతంగా కొనసాగాలని తనలాంటివారు చెబుతున్నారని.. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ పాలన కొనసాగాలి తప్ప వారి అభిప్రాయాలకు విలువ లేకుండా పాలన కొనసాగడం సరికాదన్నారు. అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు నిర్మించడం, రోడ్లు వేయించడం మాత్రమేనన్న భావన సరికాదని ఈటల రాజేందర్ చెప్పారు.
ఈటల రాజేందర్ మీద టీఆర్ఎస్ నాయకుల మాటల తూటాలను ఎక్కుపెట్టారు. ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి అని బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. ఆయన హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈటల చెబుతున్నారు. కేవలం దేవరయాంజల్ భూముల కోసమే ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆయన ఏనాడూ అసెంబ్లీలో మాట్లాడలేదని అన్నారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే.. ఈటల రాజేందర్ 2003లో పార్టీలో చేరారు. కేసీఆర్ ఈటలకు అన్ని రకాల పదవులు ఇచ్చారు. ఈటలను సొంత తమ్ముడిలా భావించి సీఎం కేసీఆర్ ఆదరించారని ఈటల చెప్పుకొచ్చారు. పార్టీలో తిరుగుబాటు తీసుకొచ్చేందుకు ఈటల ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన గౌరవానికి భంగం కలగొద్దని పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు గంగుల కమలాకర్. ఈటల ఇంత తక్కువ సమయంలో వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయాలు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని బాధ పడిన వ్యక్తి ఈటల రాజేందర్ అని గంగుల చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని గంగుల కమలాకర్ హితవు పలికారు.
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని.. ఆయన విమర్శల్లో వాస్తవం లేదని మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్‌లో తనకు గౌరవం లేదని ఈటల రాజేందర్ చెప్పడం సత్యదూరమని.. ఈటల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం జరగలేదని అన్నారు. ఉద్యమ కాలంలోనూ ఈటలను కేసీఆర్ అన్ని విధాలా గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారని. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే ఈటలకు చోటు దక్కిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని.. ఈటల రాజేందర్‌కు ఏం తక్కువైందో తమకు అర్థం కావడం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పుకొచ్చారు.