గాజు గ్లాసు.. జనసేన పార్టీ గుర్తు ఇది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసైనికులు ఈ గుర్తును ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. ఈ గుర్తు తిరుపతి ఉప ఎన్నికలో ఓ అభ్యర్థికి కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. జనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదు. బీజేపీ-జనసేన తరపున ఉమ్మడి అభ్యర్థి కమలం గుర్తుతో పోటీ చేస్తున్నారు.

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక బరిలో దిగిన నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేశ్ కుమార్ కు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ చిహ్నం. నవతరం పార్టీకి గాజు గ్లాసు గుర్తు లభించడంతో, ఓటర్లు జనసేన అనుకుని గాజు గ్లాసు గుర్తుపై ఓటేసే అవకాశం ఉందని.. ఓట్లు చీలతాయని బీజేపీ-జనసేన వర్గాల్లో ఆందోళన మొదలైంది. జ‌న‌సేన మ‌ద్ద‌తుతో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీని ఢీకొట్టాలని అనుకుంటూ ఉండగా.. బీజేపీకి ఊహించ‌ని షాక్ తగిలింది. ఒక పార్టీ గుర్తులను ఈసీ మరో పార్టీ అభ్యర్థులకు కేటాయించదు.

కానీ జనసేన పార్టీకి ఇప్పటికీ గుర్తింపు లేకపోవడంతోనే ఇలా ఆ గుర్తు మరో అభ్యర్థికి కేటాయించారని అంటున్నారు. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికల బరిలో వైసీపీ బినామీలతో నామినేషన్ వేయించి జనసేన గుర్తు లాక్కున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. గ్లాసు గుర్తును కుట్ర ప్రకారమే బినామీకి కేటాయించుకున్నారని.. దీనిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story