కాంగ్రెస్‌లోకి తీన్మార్ మల్లన్న
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు కాకరేపుతున్నాయి. తాజాగా చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో చేరారు.
By అంజి Published on 8 Nov 2023 9:46 AM IST
కాంగ్రెస్‌లోకి తీన్మార్ మల్లన్న
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇదే సమయంలో పలువురు నేతలు తమకు కలిసోచ్చే పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో చేరారు. మలన్నకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే గారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఆబ్జర్వర్ బోస్ రాజు, సిడబ్ల్యుసి సభ్యుడు గురుదీప్ సిప్పల్, ఏఐసీసీ సెక్రటరీలు పి.సి విష్ణునాధ్, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
గత కొంత కాలంగా తీన్మార్ మలన్న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ ప్రచారానికి తెర దించుతూ ఆయన హస్తం గూటికి చేరారు. గతంలో మలన్న బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో అధికార పార్టీపై మలన్న తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టుగా మల్లన్న తీరు కనిపించడంతో, ఆయన ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించడంతో కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా అదే నిజమైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ, మలన్నను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు మల్లన్నతో పార్టీ వర్గాలు చర్చలు కూడా జరిపాయి. ఇంతలోనే మలన్న తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకుని కాంగ్రెస్ గూటికి చేరడం గమనార్హం.