బీఆర్ఎస్‌కు మరో షాక్.. పార్టీకి కోనేరు కోనప్ప గుడ్‌బై!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 March 2024 7:34 AM GMTబీఆర్ఎస్‌కు మరో షాక్.. పార్టీకి కోనేరు కోనప్ప గుడ్‌బై!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మార్చి 5వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో.. రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశం అయ్యారు. ఈ భేటీ తర్వాత రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కలిసి పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సెక్రటెరియెట్‌కు వెళ్లి కలిశారు. కార్యకర్తలతో మాట్లాడిన వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని కోనేరు కోనప్ప చెప్పారు. దాంతో.. ఆయన పార్టీ మారడం కన్ఫర్మ్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు ప్రకటన వెంటనే ఆయన కాంగ్రెస్ మంత్రి పొంగులేటిని కలవడం సంచలనంగా మారింది.
బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12, లేదా 15న ఆయన హస్తం గూటికి ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఆయన మంత్రి పొంగులేటిని కలవడంతో కన్ఫర్మ్ అయినట్లే అనే అని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేశారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్‌కు ప్రమాదం అని భావించిన కోనేరు కోనప్ప.. పార్టీ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్యే ఉంటుందని అంతా భావించారు. కానీ.. సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి గెలిచారు. అయితే.. ప్రత్యర్థిగా భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న పార్టీతో బీఆర్ఎస్ జట్టు కట్టడం కోనప్పకు నచ్చలేదు. దాంతో.. పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై కీలక ప్రకటన చేయనున్నారు.