మళ్లీ తెరపైకి టీ-పీసీసీ అంశం.. రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు..!

Telangana PCC Revanth reddy..! .. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర పరాజయమైన కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ పీసీసీ

By సుభాష్  Published on  15 Nov 2020 12:48 PM GMT
మళ్లీ తెరపైకి టీ-పీసీసీ అంశం..  రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు..!

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర పరాజయమైన కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ పీసీసీ మార్పు అంశం తెరపైకి వచ్చింది. సీనియర్‌ నేతల నుంచి పార్టీ కార్యకర్తలు సైతం ఉత్తమ్‌ను తప్పించాలని డిమాండ్‌ చేస్తుండటంతో పీసీసీ అంశం మరోసారి హాట్‌టాపిక్‌ గా మారింది. మధుయాష్కి, విజయశాంతి, జగ్గారెడ్డి లాంటి నేతలు నిరసన గళం విప్పారు. రాష్ట్ర నాయకత్వం మార్చకపోతే భవిష్యత్తుల్లో మరిన్ని పరిణామాలు ఎదుర్కొక తప్పదని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు ఎంపీ రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న రేవంత్‌రెడ్డికు పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్‌ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఓ వర్గం రేవంత్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఎన్నో రోజులుగా సాగుతున్న అంశం.. మళ్లీ తెరపైకి రావడంతో పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉందనే పుకార్లు షికార్లు అవుతున్నాయి.

కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధాని మరోసారి రాజకీయ రచ్చ జరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డిసెంబర్‌ మొదటి వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు సైతం ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

మరోవైపు వామపక్షాలతో కలిసి నడిచేందుకు కాంగ్రెస్‌ సిద్దమవుతోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌-ఎంఐఎం ఓ అవగాహనకు వచ్చి దీనిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌, ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ తొలి విడత చర్చలు జరిపారు.

మేయర్‌ పీఠంపై బీజేపీ కన్ను

ఇక దుబ్బాక విజయంతో అనుహ్యంగా రేసులోకి వచ్చిన బీజేపీ.. ఏకంగా మేయర్ పీఠంపై కన్నేసింది. 70 స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు ముమ్మరం చేస్తోంది. రాజధాని పరిధి ఎన్నికలు కావడంతో టీఆర్ఎస్‌తో బీజేపీ సైతం అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక జీహెచ్‌ఎంసీలో విజయం సాధించి రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని కమళ దళం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని సీనియర్లను సైతం ఆహ్వానిస్తోంది. అలాగే మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌ విజయశాంతిని బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంతనాలు కూడా చేశారు బీజేపీ నేతలు. పార్టీలో చేరితే కోరుకున్న పదవిని కట్టబెడతామని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అందుకు రాములమ్మ సైతం కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందుగానే పార్టీలో చేరుతారని టాక్‌ వినిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్‌ కూడా ఖరారైనట్లు బీజేపీ నేతల ద్వారా సమాచారం. రాములమ్మతో పాటు మరి కొందరు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story