తెలంగాణలో ఎన్నికల హీట్.. సోషల్‌ మీడియానే ప్రచార అస్త్రం..!

తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఈక్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు నాయకులు సోషల్‌ మీడియాను ఎంచుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 Sep 2023 11:44 AM GMT
Telangana, Elections, Social media, political campaign,

తెలంగాణలో ఎన్నికల హీట్.. సోషల్‌ మీడియానే ప్రచార అస్త్రం..! 

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా చోట్ల కూడా ఇప్పటికే కన్ఫామ్‌ అయిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా లిస్ట్‌ను రెడీ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. అయితే.. ఎన్నికల్లో గెలవాలంటే ప్రచారం బాగా నిర్వహించాలి. ప్రజల్లోకి వెళ్లాలి.

ఇది డిజిటల్ కాలం. ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్ ఉంది. ఈ క్రమంలో డిజిటిల్‌ ప్లాట్‌ ఫాంగా ప్రచారం నిర్వహిస్తే మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లొచ్చు. ఒకప్పుడు ఈ డిజిటల్‌ సదుపాయాలు.. ఇంటర్నెట్‌ లేని సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేరుగా ప్రజల్లోకి వెళ్లాల్సి వచ్చేది. సభలు.. సమావేశాలు నిర్వహించేవారు. ఎక్కువ అయితే ఇంటి ఇంటికీ వెళ్లేవారు. అయితే.. ఇప్పుడు కూడా ప్రజల్లో తిరుగుతున్నా.. సోషల్ మీడియాపై కాస్త ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు నాయకులు. ఎందుకంటే సోషల్‌ మీడియా ద్వారా అయితే.. ఎప్పుడూ ఫోన్ల ద్వారా ప్రజల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. పైగా నేడు పట్టణాలే కాదు.. పల్లె గ్రామాల్లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ప్రజలు గడిపే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది.

వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌ ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా నాయకులు వారి కంటెంట్‌ను షేర్‌ చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వ్యూహకర్తలను కూడా నియమించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కొందరు నేతలు, రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని నమ్ముకుని సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు, కన్సల్లెంట్లను రంగంలోకి దించారు. కార్టూన్లు, స్పూఫ్‌ వీడియోలు, సర్వేలు, సవాళ్లు.. ఇలా ఎంతో సృజన నిండిన కంటెంట్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ప్రతి రాజకీయ పార్టీకి కూడా సోషల్‌ మీడియా సెల్‌ అని విభాగం ఉంటుంది. పార్టీకి సంబంధించి సోషల్‌ మీడియా కార్యకలాపాలను అన్నింటినీ వారే చూసుకుంటారు. ఇతర పార్టీలపై విమర్శలకు సంబంధించిన అంశం నుంచి.. సొంత పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలను షేర్‌ చేస్తుంటారు. ఎన్నికల సమయం కాబట్టి సోషల్‌ మీడియాలో ప్రతి నాయకుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌లో కొత్త న్యూస్‌ చానెల్స్‌ పుట్టుకొస్తున్నాయి. రాజకీయ నాయకులకు మద్దతు తెలుపుతూ యూట్యూబ్‌లో న్యూస్‌ చానెల్స్‌ వెలుస్తున్నాయి. స్థానికంగా వారు తిరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ.. ప్రచారంలో ముఖ్యభాగం అవుతున్నాయి.

యూట్యూబ్‌ అంటే ముందుగా ఎంటర్‌టైన్మెంట్‌ కోసం అని అన్నట్లుగా ఉండేది. సినిమాల కోసం... పాటలు.. ఇతర ప్రొగ్రామ్స్‌ను చూసేందుకు ఎక్కువగా వాడేవారు జనాలు. కానీ.. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు కుప్పలు తెప్పలుగా యూట్యూబ్‌ న్యూస్‌ చానెల్స్‌ వచ్చేస్తున్నాయి. ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి నాయకుడి కోసం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా పనిచేసే టీమ్‌ ఉందనేది అతిశయోక్తి కాదు. ఇలా ఎన్నికల కోసం మాత్రమే వచ్చే యూట్యూబ్‌ న్యూస్‌ చానెళ్లు చాలా ఉంటున్నాయి. ఎన్నికలు అయిపోగానే సైలెంట్‌ అయిపోతాయి. ఈ క్రమంలో కొందరు వీటిని విమర్శిస్తుంటే.. కొందరు మాత్రం ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారని చెబుతున్నారు. ఇక మరికొందరు అయితే సోషల్ మీడియాను ఆసరాగా తీసుకుని తప్పుడు ప్రచారాలు కూడా నిర్వహిస్తుంటారు. అలాంటి వారిపట్ల ఎన్నికల కమిషన్‌ ఓ కన్నువేసి ఉంచాలని.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story