Telangana Elections: ప్రచార హోరులోకి BRS, BJP, కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రచార కదనరంగంలోకి ప్రధాన పార్టీలు దిగుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2023 11:21 AM ISTTelangana Elections: ప్రచార హోరులోకి BRS, BJP, కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రచార కదనరంగంలోకి ప్రధాన పార్టీలు దిగుతున్నాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు సన్నద్ధం అవుతున్నారు. అయితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరుగనున్న విషయం తెలిసిందే. ప్రచార సమయం కాస్త తక్కువగా ఉందని భావిస్తున్న నాయకులు వెంటనే ప్రచార హోరులోకి దిగుతున్నారు. కాగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.
ప్రచారం పోరులో బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ అందరి కంటే ఒక అడుగు ముందే ఉన్నారు. ఆదివారమే హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఇక విపక్షాల నాయకులు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అయితే.. ఆదివారమే 51 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్‌లు ఇచ్చారు. ఇక మిగిలిన వారికి ఇవాళ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ ముందే ఉన్నారు. 119 నియోజకవర్గాలకు గాను 115 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేశారు. కాంగ్రెస్ కూడా 55 మందితో తొలి జాబితా అభ్యర్థులను విడుదల చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌ను వీడి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నేతలకు కూడా వారు కోరిన నియోజకవర్గాల నుంచే టికెట్లు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.
అక్టోబర్ 18న ములుగులోని ప్రసిద్ధ రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక ప్రార్థనలు చేయనున్నారు. ఆలయ సందర్శన అనంతరం రాహుల్‌గాంధీ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. రాహుల్, ప్రియాంక ఇద్దరూ మహిళా సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. తొలిరోజు రాహుల్ గాంధీ ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. యువతతో కలిసి భూపాలపల్లిలో రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు. ఇక అక్టోబర్ 19న రామగుండం, పెద్దపల్లిలో పర్యటిస్తారు. రామగుండంలోని సింగరేణి, ఎన్‌టీపీసీ వర్కర్స్, యూనియన్ నాయకులు, ఆర్‌ఎఫ్‌సీఎల్ వర్కర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగ బాధితులతో రాహుల్ గాంధీ సంభాషిస్తారు. మహిళా సమ్మేళనం తర్వాత ప్రియాంక ఢిల్లీ వెళ్తుంది.. రాహుల్ మాత్రం రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మూడోరోజు రాహుల్ గాంధీ నిజామాబాద్‌లో పర్యటిస్తారు. ఆర్మూర్ పసుపు, చెరుకు రైతులతో ముచ్చటించనున్నారు.
ఇక ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరిగే ర్యాలీల్లో బీజేపీ అగ్రనాయకులు పాల్గొంటారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్.. ఇతర మంత్రులు పర్షోత్తమ్ రూపాలా, సాధ్వి నిరంజన్ జ్యోతి సహా అగ్రనేతలు ర్యాలీల్లో పాల్గొంటారు. హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని జమ్మికుంటలో నిర్వహించే బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే.. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు.. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేటలో జరిగే ర్యాలీలో కూడా పాల్గొని రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించనున్నారు. అలాగే కల్వకుర్తిలో జరిగే ర్యాలీలో పాల్గొని రూపాల ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 17న జూబ్లీహిల్స్‌లో జరిగే బీజేపీ కార్యక్రమంలో పీయూష్ గోయల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.