సికింద్రాబాద్‌ నుంచి నన్ను గెలిపిస్తే స్వర్గంలా మారుస్తా: కేఏ పాల్

సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్.

By Srikanth Gundamalla  Published on  17 Oct 2023 10:27 AM IST
Telangana, elections, K.A paul, secunderabad ,

సికింద్రాబాద్‌ నుంచి నన్ను గెలిపిస్తే స్వర్గంలా మారుస్తా: కేఏ పాల్

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ప్రచారంలో మునిగిపోయాయి ప్రధాన పార్టీలు. ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. చేసిన అభివృద్ధిని వివరిస్తూ అధికార పార్టీ నాయకులు ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్ఎస్‌ భావిస్తోంది. ఈ సారి ఎలాగైనా బీఆర్ఎస్‌ను గద్దె దింపి అధికారం చేపట్టాలని కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ క్రమంలో జాతీయ నాయకులతో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారాలు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించారు.

ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసే సందడి అంతా ఇంతా కాదు..గత ఎన్నికల్లో ప్రచారం పేరుతో హంగామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన వీడియోలు హల్‌చల్‌ చేశాయి. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని తెలిపారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అన్నారు. తనని గెలిపిస్తే సికింద్రాబాద్‌ నియోజకవర్గాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆశీర్వదించాలని కేఏ పాల్ కోరారు.

అలాగే బీఆర్ఎస్‌ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కేఏ పాల్ విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక్క అంశం కూడా నెరవేర్చే విధంగా లేవని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని మాయటమాటలు చెప్పి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారని అన్నారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే అందుకు నిదర్శనమన్నారు కేఏ పాల్. ఇక ప్రజాశాంతి పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునేవారు పార్టీ ఆఫీసులో తనని సంప్రదించాలని ఈ సందర్భంగా కేఏ పాల్ తెలిపారు.

Next Story