దసరా తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. వ్యూహంలో భాగమేనా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను దసరా పండుగ తర్వాత ప్రకటించే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు.
By అంజి
దసరా తర్వాతే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన.. వ్యూహంలో భాగమేనా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదన్న ప్రశ్నకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అక్టోబర్ 24న జరగనున్న దసరా పండుగ తర్వాత అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చని రేవంత్ అన్నారు. పోటీదారులను ప్రకటించకపోవడం కాంగ్రెస్ "వ్యూహం"లో భాగంగా కనిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) తమ అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందుగా ప్రకటించినందున, వారు దానిని అనుసరించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆగస్టులో 119 మంది సభ్యుల అసెంబ్లీకి బీఆర్‌ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులతో తన జాబితాను ప్రకటించింది.
''రాజకీయాలకు వ్యూహాలు ఉంటాయి. మేము ఆ వ్యూహాలను అనుసరిస్తున్నాము. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రజలకు ఎలాంటి సంక్షేమం చేస్తామన్నది మాత్రం వెల్లడించలేదు. మా ఆరు హామీలను ప్రజలకు ప్రకటించాం. అభ్యర్థులు మా ప్రాధాన్యత కాదు. ప్రజలకు అందించబోయే సంక్షేమం, చేపట్టబోయే అభివృద్ధే మా ప్రాధాన్యత'' అని రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడానికే ఆసక్తి చూపుతుందని, తమ మ్యానిఫెస్టోను కాదని పేర్కొంటూనే, భారతీయ జనతా పార్టీ (BJP)కి కూడా అభ్యర్థులు లేదా మ్యానిఫెస్టో లేదని చెప్పడం ద్వారా ఆయన ధీమాగా ఉన్నారు. ‘‘మా ఆరు హామీల గురించి ప్రజలకు స్పష్టంగా చెప్పాం. ఆ హామీలే మా అభ్యర్థులు’’ అని అన్నారు. కాగా, అక్టోబర్ 15న తమ మేనిఫెస్టోను విడుదల చేస్తామని బీఆర్‌ఎస్ ప్రకటించింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఆరు హామీలు – పేద కుటుంబాల్లోని మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, రాష్ట్ర రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం పథకం. వ్యవసాయ కూలీలకు వార్షిక ప్రోత్సాహకం రూ.12,000, కనీస మద్దతు ధర కంటే పైబడిన వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల వరకు బీమా, చేయూత పథకం కింద పేదలకు రూ. 4,000 పింఛను, ఉన్నత చదువులు చదివేందుకు తక్కువ ఆదాయ నేపథ్యం ఉన్న విద్యార్థులకు రూ.5 లక్షల సహాయం.
కాగా, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. నవంబర్ 30న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తామని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.