చంద్రబాబు అరెస్ట్‌ వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారు: మధుయాష్కి

చంద్రబాబు అరెస్ట్‌ గురించి తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కి స్పందించారు. సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  19 Sept 2023 4:45 PM IST
Telangana, Congress, Madhu Yashki,  Chandrababu Arrest,

 చంద్రబాబు అరెస్ట్‌ వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారు: మధుయాష్కి

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఆయనకు దాదాపు అన్ని పార్టీల నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కి.. చంద్రబాబు అరెస్ట్‌ గురించి స్పందించారు. సంచలన కామెంట్స్ చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ వెనుక ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారని ఆరోపించారు మధుయాష్కి. దీనికి సంబంధించిన పక్కా సమాచారం కూడా తన దగ్గర ఉందన్నారు. ఏపీలో జగన్‌ మరోసారి గెలవాలని కేసీఆర్‌ వందల కోట్లు ఖర్చు పెట్టారనే విషయం అందరికీ తెలుసు అని అన్నారు. చంద్రబాబుపై మోదీకి శత్రుత్వం ఉందని అన్నారు. చంద్రబాబు గతంలో మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని మధుయాష్కి ఆరోపణలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్ గానీ.. కేటీఆర్‌ కానీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు మధుయాష్కి.

ఆంధ్రప్రదేశ్‌ సెటిలర్స్‌ ఓట్ల కోసం ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చంద్రబాబుకి అనుకూలంగా కల్లబొల్లి మాటలు మాట్లాడారు అని మధుయాష్కి దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆప్‌ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను అరెస్ట్‌ చేశారీ.. కానీ ఇంతవరకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. దీని ద్వారా బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య ఉన్న మ్యాచ్‌ ఫిక్సింగ్ అర్థం అయ్యిందని మధుయాష్కి అన్నారు.

Next Story