నేను ఇంకా రాజీనామాకు కట్టుబడే ఉన్నా: హరీశ్‌రావు

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

By Srikanth Gundamalla  Published on  30 Aug 2024 8:30 AM IST
Telangana, brs, harish rao, comments,   resign ,

నేను ఇంకా రాజీనామాకు కట్టుబడే ఉన్నా: హరీశ్‌రావు 

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తన రాజీనామా సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని చెప్పారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసినట్లుగా నిరూపించాలనీ.. అప్పుడు తప్పకుండా రాజీనామా చేస్తానని అన్నారు. అయితే.. ఆగస్టు 15లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని మాజీమంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రుణమాఫీ పాక్షికంగా మాత్రమే జరిగిందని.. స్వయంగా తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారని హరీశ్‌ రావు గుర్తు చేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపైనా హరీశ్‌రావు విమర్శలు చేశారు. ఆయన నిర్వహించింది చిట్‌ చాట్‌లు కాదనీ.. చీట్‌చాట్‌లు అంటూ విమర్శించారు. చిట్‌ చాట్‌ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేయని దొంగ.. తనని దొంగ అంటున్నారా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాల్మీకి స్కామ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్‌కి ఉందా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఈ అంశంపై విచారణ చేయడం లేదని నిలదీశారు. బడే భాయ్.. చోటా భాయ్‌ కాబట్టే తెలంగాణలో విచారణ చేయించడం లేదని ఆరోపించారు. ఒక పక్క రాహుల్‌ గాంధీ.. మరోపక్క బీజేపీ కూడా వాల్మీకి స్కామ్‌పైమాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని ఫైర్ అయ్యారు. కూల్చివేతల ప్రభావంతో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా తగ్గిపోయిందన్నారు హరీశ్‌రావు. బుద్ధభవన్‌లో హైడ్రా ఆఫీసు, జీహెచ్‌ఎంసీ ఆఫీసులు నాలాపైనే ఉన్నాయనీ అన్నారు. ముందుగా వాటిని కూల్చాలంటూ మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అలాగే నెక్లెస్‌ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, ఐమాక్స్‌లను కూలగొట్టాలని అన్నారు.

Next Story