కౌశిక్‌రెడ్డిపై దాడికి కారణం సీఎం రేవంత్‌రెడ్డే: హరీశ్‌రావు

తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కాయి.

By Srikanth Gundamalla  Published on  13 Sep 2024 10:12 AM GMT
కౌశిక్‌రెడ్డిపై దాడికి కారణం సీఎం రేవంత్‌రెడ్డే: హరీశ్‌రావు

తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కాస్త.. తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే దాడులకు దారి తీసింది. అరెస్ట్‌ల పర్వం కొనసాగింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కౌశిక్‌ రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారని హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగినప్పుడు డీజీపీ ఎందుకు స్పందించలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు జరిగితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. గురువారం జరిగిన సంఘటనకు సీఎం రేవంత్‌రెడ్డే కారణమని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. అరికెపూడి గాంధీని గురువారమే హౌస్ అరెస్ట్ చేసి ఉంటే కౌశిక్‌ రెడ్డిపై దాడి జరిగేది కాదన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ అరాచక పాలన గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కదారి పట్టించేందుకే కౌశిక్‌ రెడ్డిపై దాడి చేయించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని రాళ్లు వేస్తారో వేయండి.. వాటితోనే తాము మరోసారి అధికారంలోకి వస్తామన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారని హరీశ్ రావు అన్నారు.

Next Story