24 గంటల కరెంట్‌ను 16 గంటలకు తగ్గించేశారు: హరీశ్‌రావు
పటాన్‌చెరులో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 3:15 PM IST24 గంటల కరెంట్‌ను 16 గంటలకు తగ్గించేశారు: హరీశ్‌రావు
పటాన్‌చెరులో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు. గ్లోబెల్స్ ప్రచారం చేసి
గెలిచిందని ఆరోపించారు.
ఎన్నికల్లో గెలిచిన వెంటనే రైతుబంధు రూ.15వేలు పెంచి ఇస్తామని చెప్పి మాటమార్చారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. వడ్లకు బోనస్, వృద్ధ్యాప్య పెన్షన్ పెంపు, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రచారం చేశారని అవి ఇంకా అమలు చేయడం లేదన్నారు. అలాగే ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే .. తొందరెందుకు అంటున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. కేసీఆర్ సర్కార్ 24 గంటల కరెంటు ఇస్తే.. ఇప్పుడు 15 నుంచి 16 గంటలకు తగ్గించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్వెర్టర్లు, జనరేటర్లకు డిమాండ్ పెరిగిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
ఢిల్లీ..లేదా గల్లీలో ఎక్కడైనా సరే తెలంగాణ ప్రజల తరఫున పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు మాజీమంత్రి హరీశ్‌రావు. కృష్ణా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందని విమర్శించారు. అలాగే దేశంలో ఇండియా కూటమి పని అయిపోయిందనీ.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు కూడా తెచ్చుకోలేదేమో అని మమతా బెనర్జీనే అన్నారని గుర్తు చేశారు. ఒక్కొక్కరుగా ఆ కూటమి నుంచి బయటకు వస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు ఒక స్పీడ్ బ్రేకర్ వంటిదని హరీశ్‌రావు అన్నారు. మరోవైపు రాముడు అందరి వాడు అనీ.. రాజకీయంగా వాడుకుని బీజేపీ ఓట్లు అడుగుతోందనీ.. వారికి ఎవరూ ఓటు వేయరని చెప్పారు. ఏం చేశారో చెప్పుకోవడాని లేక దేవుడి పేరుతో ఓట్లు అడుగుతారా అని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.