భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. యూపీలో రాజ్యసభ స్థానాల నామినేషన్లకు నేడే(మంగళవారం) ఆఖరి రోజు. సోమవారం పొద్దుపోయిన తర్వాత లక్ష్మణ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. దీంతో ఆయన ఈ ఉదయమే లక్నో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. లక్ష్మణ్ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
1956 జూలై 3న హైదరాబాద్‌లో జన్మించిన లక్ష్మణ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేశారు. ఓయూలో చదువుతున్నపుడే అఖిల భారత విద్యార్థి పరిషత్ లో పనిచేశారు. తొలిసారిగా ఎన్నికల పోటీలో భాగంగా 1994లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1999లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున మొదటిసారిగా రాజ్యసభకు వెళ్తున్న నాయకుడు లక్ష్మణే కావడం గమనార్హం.