తుది దశకు బీజేపీ అభ్యర్థుల ఎంపిక.. నేడో, రేపో ప్రకటన!
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు తొలి జాబితా విడుదయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 16 Oct 2023 9:13 AM ISTతుది దశకు బీజేపీ అభ్యర్థుల ఎంపిక.. నేడో, రేపో ప్రకటన!
త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు 119 నియోజకవర్గాలకు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇక బీజేపీ తరపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు తొలి జాబితా విడుదల చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది.
ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరగనున్న సమావేశంలో రాష్ట్ర బీజేపీ నుంచి అందిన అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నారు. ఆ తర్వాత తొలిజాబితా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఇవాళ సాయంత్రం అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ కాకుంటే.. రేపు ప్రకటించనున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. రాష్ట్ర పార్టీ స్థాయిలో ముసాయిదా జాబితా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే 40 - 45 మందితో కూడిన అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. ఆ పార్టీ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదిరితే అంతకంటే ఎక్కవ సీట్లకే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడమే కాదు, అభ్యర్థులకు బీ ఫారంలు కూడా అందించింది. అటు కాంగ్రెస్ 55 మందితో ఫస్ట్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థుల లిస్ట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఢిల్లీలో జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హాజరు కానున్నట్టు సమాచారం.