టీ-బీజేపీ తొలి జాబితా రెడీ? లిస్ట్‌ విడుదల అప్పుడేనా?

అమిత్‌షా పర్యటన తర్వాత తొలి జాబితాను విడుదల చేసేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2023 5:01 AM GMT
Telangana, BJP, Assembly Elections, First list,

టీ-బీజేపీ తొలి జాబితా రెడీ? లిస్ట్‌ విడుదల అప్పుడేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దాంతో.. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్‌ తొలి జాబితా సిద్ధం చేసింది.. దాదాపు 95 శాతం అభ్యర్థులను ఖరారు చేసిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. సీఎం కేసీఆర్‌ ఈనెల 21న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో మిగతా పార్టీలు కూడా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవ్వకముందే అభ్యర్థులను ప్రకటించి.. ప్రజల్లోకి మరింత లోతుగా వెళ్లాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ మూడో వంతుకు పైగా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. ముఖ్య నేతలు, బలమైన ఒకే అభ్యర్థి ఉన్న 20 సీట్లతో పాటు.. ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఉన్న మరో 25 సీట్లకు టికెట్లు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సభ ఉంది. అమిత్‌షా పర్యటన తర్వాత రెండు మూడు రోజుల్లోనే తొలి జాబితాను విడుదల చేసేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యనేతలు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు డీకే అరుణ, ఈటల రాజేందర్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటిన నాయకుల పేర్లు తొలిజాబితాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దశల వారీగా ప్రజల్లోకి వెళ్తూ.. విస్తృత ప్రచారం చూస్తూ మిగతా అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు, మిగతా పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే అంశాలను బీజేపీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పరిణామాలను పరీక్షించి.. వివిధ నియోజకవర్గాల్లో గెలిచే వారిని.. ఎన్నికల్లో ప్రభావం చూపే వారు ఎవరనే అంశాలపై ఆరా తీస్తోంది. గెలిచే అవకాశాలు ఉండి.. మిగతా పార్టీల్లో టికెట్లు దక్కనివారిని బీజేపీలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సర్దుబాటుకి వీలు ఉండేలా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెండింగ్‌లోనే పెట్టాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులు ఎవరైనా ఎన్నికల్లో ప్రభావం చూపేలా ఉండేవారు బీజేపీ చేరితో వారికి ఆ స్థానం ఇచ్చి సర్దుబాటు చేసేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

అయితే.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే సీటు గెలిచింది. కానీ.. ఆ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఓట్ల శాతం 23.5 శాతానికి పెరిగింది. అంతేకాక నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ. ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లోనూ గెలుపు, జీహెచ్‌ఎంసీలో మెజార్టీ స్థానాలు సాధించడంతో తెలంగాణ బీజేపీలో ఊపువచ్చిందనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని.. అందుకే జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక జరపాలని పార్టీ అధినాయకులు భావిస్తున్నారు. ఈ నెల 27న అమిత్‌షా రాష్ట్ర పర్యటన తర్వాత.. 40 నుంచి 45 మంది అభ్యర్థులతో తొలి జాబితా.. ఆ తర్వాత సెప్టెంబర్‌ రెండో వారానికల్లా మరికొందరు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story