తెలంగాణ ఎన్నికలు: అందరి చూపు పాలేరుపైనే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్‌ఎస్ టికెట్లు దక్కని నేతలు అసహనం వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
By అంజి Published on 27 Aug 2023 12:43 PM IST
తెలంగాణ ఎన్నికలు: అందరి చూపు పాలేరుపైనే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్‌ఎస్ టికెట్లు దక్కని నేతలు అసహనం వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం పేరు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రాంతం ప్రముఖ రాష్ట్ర నాయకుల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలో పాలేరు నియోజకవర్గం తనదైన రాజకీయ డైనమిక్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తోంది. కాగా ఖమ్మం జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు కీలక నేతలు ఆసక్తి చూపుతున్నారు.
పాలేరు టికెట్‌ను ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ నుంచి ప్రతిఘటన ఎదురవడంతో కాంగ్రెస్ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజల నిర్ణయం మేరకు పాలేరు నుంచే మాజీ మంత్రి తుమ్మల పోటీ చేస్తారని ఆయన తనయుడు యుగంధర్ ప్రకటించారు. అదేసమయంలో వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆమె ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మించి విస్తరించడంలో కాంగ్రెస్ నాయకత్వం సంకోచిస్తున్నట్లు కనిపిస్తోంది.
కొన్ని డిమాండ్ల విషయంలో షర్మిల విముఖత చూపడం వల్లే విలీన ప్రణాళికలు వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాలేరు నుంచి టికెట్ ఇస్తేనే విలీనానికి అంగీకరిస్తానని షరతు విధించినట్లు సమాచారం. ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు ఈ మూడు నియోజిక వర్గాల బరిలో నిలిచేందుకు పొంగులేటి దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి మరోసారి విజయాన్ని సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు.